స‌చివాల‌యంకూల్చివేత‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 

తెలంగాణ రాష్ట్ర పాత సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు తొలగిపోయాయి.  స‌చివాల‌యం భ‌వ‌నాల కూల్చివేత‌కు హైకోర్టు నుంచి అనుమ‌తి ల‌భించింది. భ‌వ‌నాల కూల్చివేత‌ను నిలిపివేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ ను కోర్టు కొట్టేసింది. భ‌వ‌నాల‌ కూల్చివేత‌కు ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని కోర్టు తేల్చిచెప్పింది.
 
రాష్ట్ర మంత్రి వ‌ర్గ నిర్ణ‌యాన్ని హైకోర్టు స‌మ‌ర్థించింది. కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ భ‌వ‌నాల కూల్చివేత ప‌నులు కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వానికి కోర్టు సూచించింది. ఇప్పటికే 80 శాతం భవనాలను కూల్చివేశారు. ఇక కూల్చివేతలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆ పనులను మరింత వేగంగా పుంజుకోనున్నాయి.
భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కాలుష్య నివారణ బోర్డు (పీసీబీ) రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ  (ఎస్‌ఈఐఏఏ) హైకోర్టుకు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసిన ‘నిర్మాణం- కూల్చివేత నిబంధనలు- 2016’ను పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నాయి. 
 
పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా పాత సచివాలయ భవనాలు కూల్చుతున్నారని దాఖలైన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. బుధవారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్ పీసీబీ, ఎస్‌ఈఐఏఏ వివరణను ధర్మాసనానికి సమర్పించారు. 
 
శుక్రవారం నాటికి విచారణ వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించిన విష‌యం విదిత‌మే. ఇవాళ విచార‌ణ చేప‌ట్టిన కోర్టు.. భ‌వ‌నాల కూల్చివేత‌ను నిలిపివేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ ను కొట్టేసింది.కోవిడ్-19 దృష్టిలో ఉంచుకుని పనులు జరుపుకోవాలని కోర్టు సూచించింది. 
 
భవనాల కూల్చివేతలకు ప్రభుత్వానికి అన్ని అధికారులు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది.
ఇదే వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి సుప్రీంలో చుక్కెదురైంది. సచివాలయం కూల్చివేతపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.