విద్యార్థుల వీసాలపై వెనక్కు తగ్గిన ట్రంప్ 

ఆన్‌లైన్ ద్వారా క్లాసుల‌కు హాజ‌రవుతున్న విదేశీ విద్యార్థుల వీసాల‌ను ర‌ద్దు చేయాల‌ని జూలై 6వ తేదీన అమెరికా ప్ర‌భుత్వం జారీచేసిన ఆదేశాలపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వెనుక్కు తగ్గారు.  దేశ‌వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల నుంచి ఆందోళ‌న‌లు వ్య‌క్తం కావ‌డంతో అమెరికా ప్ర‌భుత్వం వివాదాస్పద వీసా విధానాన్ని ర‌ద్దు చేసింది. 

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు విద్యాసంస్థ‌లు ఆన్‌లైన్ పాఠాల‌కు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ట్రంప్ స‌ర్కార్  ఆన్‌లైన్ పాఠాలు వింటున్న విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల‌ని ఆదేశించింది. ట్రంప్ ప్ర‌భుత్వం తీసుకున్న ఆ నిర్ణ‌యం ప‌ట్ల హార్వ‌ర్డ్‌, మ‌సాచుసెట్స్‌ యూనివ‌ర్సిటీలు కోర్టులో దావా వేశాయి. అమెరికా ఇమ్మిగ్రేష‌న్‌, క‌స్ట‌మ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)పై కేసును ఫైల్ చేశాయి. ఈ నేప‌థ్యంలో త‌మ నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలంటూ ఐసీఈ జారీ చేసిన ఆదేశాల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని హార్వ‌ర్డ్‌, మిట్ వ‌ర్సిటీలు కోర్టును కోరాయి. ప్రభుత్వం నిర్ణ‌యం వ‌ల్ల విద్యార్థులు వ్య‌క్తిగ‌తంగా, ఆర్థికంగా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని వ‌ర్సిటీలు త‌మ పిటిష‌న్‌లో ఆరోపించాయి.  ట్రంప్ స‌ర్కార్ వెన‌క్కి త‌గ్గ‌డం ఒక‌ర‌కంగా భార‌తీయ విద్యార్థుల‌కు సంతోష‌క‌ర‌మైన విష‌య‌మే.