కరోనా సమయంలో నైపుణ్యమే కీలకం 

కరోనా మహమ్మారి మనకు సరికొత్త సవాళ్ళను విసిరిందని, దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.  బుధవారం ప్రపంచ యువజన నైపుణ్యం దినోత్సవం పురస్కరించుకుని యువతను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడుతూ నైపుణ్యం అనేది చాలా కీలకమైందని, ఇలాంటి సమయంలోనే యువత తమ నైపుణ్యంకు పదును పెట్టాలని సూచించారు. 
 
“మీ నైపుణ్యాలను నిరూపించుకునేందుకు ఈ రోజును అంకితం ఇచ్చారు. కొత్త కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడమే కోట్లాది మంది యువత బలం. కరోనా వైరస్‌ ఉద్యోగాల స్వభావాన్ని మార్చేసింది. మన జీవితాలపై ప్రభావం చూపించే కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది. యువత ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను ఎంచుకోవాలి” అని ప్రధాని హితవు చెప్పారు. 
 
ఇప్పటి పరిస్థితిలో నిలదొక్కుకోవాలంటే ‘స్కిల్‌, రీ స్కిల్‌, అప్‌స్కిల్‌” అనే మంత్రాన్ని పటించాలని మోదీ  సూచించారు. జ్ఞానం, నైపుణ్యం మధ్య కొందరు ఎప్పుడూ కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారని ప్రధాని చెప్పారు. పుస్తకాలు చదివి, ఇంటర్నెట్‌ చూసి చాలా నేర్చుకోవచ్చని, దాన్ని ఆచరణలో పెట్టేందుకు నైపుణ్యాలు  కావాలని పేర్కొన్నారు. ఏదైనా కొత్త నైపుణ్యంనేర్చుకోవాలంటే నైపుణ్యం నేర్చుకోవాలన్న తపన ఉండాలని, లేకుంటే జీవితం ఆగిపోతుందని హితవు చెప్పారు.