విశాఖ రాంకీ ఫార్మాసిటీలో భారీ ప్రమాదం

విశాఖపట్నం నగరాన్ని పారిశ్రామిక ప్రమాదాలు వెంటాడుతున్నాయి. పరవాడ రాంకీ ఫార్మాసిటీలో గత  అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాల్వెంల్స్‌ ఫార్మా కంపెనీలో ట్యాంకు పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు మరో రెండు ట్యాంకులకు అంటుకుని దట్టంగా పొగలు అలుముకున్నాయి. 
 
 రాత్రి 11 గంటల ప్రాంతంలో సాల్వెంట్ ప్లాంట్‌లో జరిగిన ఈ భారీ పేలుడుతో వైజాగ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయని.. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే తాజాగా ఘటనాస్థలంలో ఒకరి మృతదేహం లభ్యమైందని తెలుస్తోంది. మృతదేహం శిధిలాల కింద ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంకా దృవీకరించాల్సి ఉంది.   
 
ట్యాంకులో మిథనాల్‌ సాల్వెంట్‌ నిల్వతో ప్రమాద తీవ్రత పెరిగింది. పలుమార్లు పేలుడు జరగడంతో అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి దూరంగానే ఉన్నాయి. సుమారు ఐదు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పింది. ప్రమాద సమయంలో ఫార్మా కంపెనీలో నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
 
సమీపంలో అనేక కంపెనీలు ఉండటంతో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన కార్మికుడు మల్లేశ్వరరావును గాజువాక ఆస్పత్రికి తరలించారు. భారీ పేలుళ్లతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలాన్ని డీసీపీ, ఆర్డీవో పరిశీలించారు.