బెంగాల్ బిజెపి ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి 

బెంగాల్ లో బిజెపి ఎమ్మెల్యే అనుమానాస్పదంగా చనిపోవడం దుమారం రేపింది. తన ఇంటికి దగ్గర్లోని ఓ షాపు వద్ద ఉరి వేసుకుని చనిపోవడం కలకలం రేపుతోంది. ఇది హత్యే అని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే ఎమ్మెల్యే మరణానికి కారణమని చెబుతున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ దినాజ్పూర్ జిల్లా హెంతాబాద్ (రిజర్వ్డ్) సీటు నుంచి దేబేంద్రనాథ్ రాయ్ (60) సీపీఎం టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. తన ఎమ్మెల్యే సభ్యత్వానికి మాత్రం ఆయన రాజీనామా చేయలేదు.

సోమవారం హెంతాబాద్ ఏరియా బిందాల్ గ్రామంలోని తన ఇంటికి దగ్గర్లోని ఓ షాపు సీలింగ్ కు రాయ్ ఉరి వేసుకుని కనిపించారు. ఇది ఆత్మహత్యేనని, మృతదేహం నుండి  నుంచి ఓ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, తన మరణానికి ఇద్దరు వ్యక్తులు కారణమని రాయ్ అందులో రాశారని పోలీసులు తెలిపారు. 

దర్యాప్తు ప్రారంభమైందని, ఫోరెన్సిక్ బృందం  ఆధారాలు సేకరించిందని, మృతదేహాన్ని శవపరీక్ష  కోసం పంపించామని చెప్పారు. అయితే రాయ్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యేనని, సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

రాయ్ ని  టీఎంసీ గూండాలే చంపేశారని, మంగళవారం 12 గంటల పాటు జిల్లా బంద్ పాటించాలని బీజేపీ పిలుపునిచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో గూండారాజ్యం నడుస్తోందని, శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు.