దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలన్న డిమాండ్లు  

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలన్న డిమాండ్లు  

దేశంలో కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. వైరస్‌ ఉద్ధృతంగా ఉన్న చోట ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తున్నాయి. బెంగళూరులో మంగళవారం నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తామని ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం తాజాగా ధార్వాడ్‌, దక్షిణ కన్నడ జిల్లాల్లోనూ లాక్‌డౌన్‌కు అనుమతినిచ్చింది. 

ఈ మేరకు ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలు సోమవారం ప్రకటన విడుదల చేశాయి. ధార్వాడ్‌లో బుధవారం నుంచి 9 రోజులు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. దక్షిణ కన్నడ జిల్లాలో వారం రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రజలు, అధికారుల ఆకాంక్షల మేరకే మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు మంత్రి జగదీశ్‌ షెట్టర్‌ తెలిపారు. 

లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని జేడీఎస్‌ నేత దేవెగౌడ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈశ్వర్‌ స్వాగతించారు. అయితే రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ విధించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ వంటి నగరాలలో వర్తక సంఘాలే స్వీయ లాక్ డౌన్ విధించుకొంటున్నాయి. 

జమ్మూకశ్మీర్‌లో వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య వేగంగా  పెరుగుతుండటంతో అక్కడ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒక్క శ్రీనగర్‌లోనే 88 కంటైన్మెంట్‌ ప్రాంతాలను గుర్తించారు. లాల్‌చౌక్‌ సహా అన్ని వ్యాపార సముదాయాలను మూసివేశారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించకుండా కశ్మీర్‌ లోయలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

మాస్కు ధరించకపోతే రూ. 1000, కంటైన్మెంట్‌ జోన్లలో భౌతి క దూరం నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 10వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. అహ్మదాబాద్‌లో కూడా మాస్కు ధరించకపోతే జరిమానాను రూ. 200 నుంచి రూ. 500కు పెంచారు.

బీహార్ మరోమారు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌కు సిద్ధమవుతోంది. ఇందుకోసం బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వ‌హించ‌నుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల క‌ట్ట‌డి గురించి సమీక్షించ‌నున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే దిశ‌గా ఆలోచిస్తున్న‌దని బీహార్ ప్రధాన కార్యదర్శి దీపక్‌కుమార్ తెలిపారు.