కేసీఆర్‌ ఆదేశాలతోనే అరవింద్ పైదాడి 

కేసీఆర్‌ ఆదేశాలతోనే అరవింద్ పైదాడి 

వరంగల్‌లో తమ పార్టీ ఎంపీ అర్వింద్‌పై టీఆర్‌ఎస్‌ దాడిచేయడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే తెలంగాణ ద్రోహులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘

‘మా సహనాన్ని పరీక్షించవద్దు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని మరచిపోవద్దు’’ అని హెచ్చరించారు. ‘‘కొవిడ్‌, పోతిరెడ్డిపాడు, రైతుల సమస్యలపై బీజేపీ పోరాడుతోంది. అందుకే బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం. మొరగడానికి కొంతమందిని, కరవడానికి కొంతమందిని సీఎం పెట్టుకున్నారు” అంటూ ధ్వజమెత్తారు.

అయితే వాళ్లను చూసి బీజేపీ భయపడదని సంజయ్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్య వస్తే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని తే చెప్పారు. అర్వింద్‌పై పథకం ప్రకారం దాడి జరిగిందని పేర్కొంటూ  దాడులను ప్రోత్సహించిన వారిపై, ఈ ఘటనను చూసీచూడనట్లుగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్‌ చేశారు.

నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై వరంగల్‌లో టీఆర్ఎస్ కార్యకర్తల దాడి అనాగరికం అంటూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించేవారిపై భౌతికదాడులకు దిగడమే ప్రభుత్వ విధానంగా మారడం పట్ల విచారం వ్యక్తం చేశారు. 

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడం ప్రతిపక్షాల బాధ్యత అని పేర్కొంటూ  టీఆర్ఎస్ ప్రభుత్వం ఇకనైనా భౌతికదాడులకు స్వస్తి చెప్పాలని హితవు చెప్పారు.  భౌతికదాడుల ద్వారా తమ  ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. 

కొన్ని హిందూ వ్యతిరేకశక్తులు వరంగల్‌లో తనపై దాడిచేశాయని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. హైవేపై తన వాహనాన్ని వెంబడించాయని చెప్పారు. ఒక ప్రజా ప్రతినిధిపై పట్టపగలు దాడి జరగడం సీఎం, హోంమంత్రి డీజీపీలు సిగ్గుపడాల్సిన విషయమని ఆయన విమర్శించారు.

కాగా, పోలీసుల సమక్షంలో ఎంపీ అర్వింద్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన దాడి.. కేసీఆర్‌ రాక్షస పాలనను తలపిస్తోందని బీజేపీకి ఎంపీ సోయం బాపురావు, మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. అర్వింద్‌పై దాడిని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఖండించారు.