గోదావరి జలాల తరలింపుపై తెలంగాణ ఫిర్యాదు 

కృష్ణ జలాల అక్రమ వినియోగంపై ఇప్పటికే పరస్పరం ఫిర్యాదులు చేస్తుకున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు గోదావరి జలాల వినియోగంపై వివాదానికి దిగుతున్నాయి.  పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను కృష్ణా, పెన్నా బేసిన్‌‌కు తరలించడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టును అడ్డుకోవాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)ను తెలంగాణ సర్కారు కోరింది. 
 
ఏపీ పుననిర్మాణ చట్టంను అతిక్రమించి ఏపీ సర్కారు చేపడుతున్న మళ్లింపు ప్రాజెక్టును ఆపేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ లేఖ వ్రాసారు. 
ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన పోలవరం నుంచి గోదావరి జలాల మళ్లింపును, ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు.
 
 గవర్నర్ ప్రసంగంలో రాయలసీమ దుర్భిక్ష నివారణ ప్రాజెక్టును చేపట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా పోలవరం కుడి కాలువ సామర్ధ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచి కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు నీటిని మళ్లిస్తామన్నారని ఆ లేఖలో వివరించారు. 
 
గోదావరి మిగులు జలాల్లో తెలంగాణ వాటా తేలకుండా ఏపీ కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వీల్లేదని, ఇది తెలంగాణ హక్కులకు విరుద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టని స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌‌ సమర్పించేలా ఏపీని ఆదేశించాలని, బోర్డు, ఇతర టెక్నికల్ అప్రైజల్స్ వచ్చే వరకు ప్రాజెక్టుపై ముందుకెళ్లకుండా ఆదేశించాలని కోరారు. 
 
ఏపీ ప్రభుత్వం 2014 జూన్ 2 తర్వాత చేపట్టిన పట్టిసీమ, చింతలపూడి లిఫ్ట్ స్కీమ్‌‌ల ద్వారా గోదావరి నీళ్లను ఇప్పటికే పెన్నా బేసిన్‌‌కు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు.