ఏపీలో క్రైస్తవ మతమార్పిళ్ల అంశంలో ఎల్.ఆర్.పి.ఎఫ్ నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగం, తప్పుదోవ పట్టించే జనాభా లెక్కలు మొదలైన అంశాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సమర్పించిన సమగ్ర నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి సూచించింది.

 

దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, పొంచివున్న ప్రమాద ఘంటికలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సమర్పించిన నివేదికలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో చట్టాలు ఏ స్థాయిలో దుర్వినియోగం అవుతున్నాయో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఈ నివేదికలోని కొన్ని ముఖ్య అంశాలు:

రోజురోజుకూ అధికమవుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. వీటి కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నానికి గురవుతున్నాయి, సామాజిక జీవనానికి ఆటంకం కలుగుతోంది, శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. అంతేకాదు.. జాతి భద్రతకు సైతం ఇది పెనుప్రమాదంగా పరిణమించింది.

తమకు ప్రత్యేక దేశం కావాలంటూ కొందరు పాస్టర్లు చేస్తున్న ప్రసంగాలు మతం మారుతున్న వారి మెదళ్లలో దేశవ్యతిరేక బీజాలు నాటుతున్నాయి.. మరికొందరిలో సాటి మతాల పట్ల ద్వేషభావం కలిగిస్తున్నాయి. దేశభద్రతకు మాత్రమే కాదు. సామాజిక భద్రతకు కూడా ఇది ముప్పే.

మతమార్పిడి చేస్తున్న వారి మాయలో పడ్డ అమాయకులు బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరుఅవ్వడం మానేస్తున్నారు. భార్యాభర్తల మధ్య చిచ్చుకు కూడా ఇవి కారణం అవుతున్నాయి.

రాష్ట్రంలో మతమార్పిళ్ల తీరుతెన్నులు, చట్టాల దుర్వినియోగం, ప్రభుత్వాల ఉదాసీనత ఏ స్థాయిలో ఉందో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ నివేదిక పరిశీలిస్తే అర్ధమవుతుంది .

నివేదికలో ఉదహరించిన దాని ప్రకారం.. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న చర్చిల సంఖ్య సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించడం జరిగింది. ఈ సంఖ్య పరిశీలిస్తే ఆ మండలంలో మొత్తం 68 చర్చిలు ఉన్నాయి. ఆ మండలంలో ఉన్న గ్రామాల సంఖ్య మాత్రం 11.  అంటే.. సగటున గ్రామానికి 6 చర్చిలన్న మాట!!

2011 జనాభా గణన ప్రకారం రెడ్డిగూడెం మండలలోని క్రైస్తవ జనాభా 630. కానీ ఇదే మండలంలోని మద్దులపర్వ  గ్రామాన్ని తీసుకుంటే.. ఇటీవల సమాచార హక్కు చట్టం కింద రెవెన్యూ శాఖ ఇచ్చిన సమాచారం నివ్వెరపరుస్తుంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఆ గ్రామంలో క్రైస్తవ జనాభా సున్నా (0). కానీ అక్కడ ఉన్న చర్చిల సంఖ్య మాత్రం ప్రభుత్వ రికార్డుల ప్రకారం 11!

క్రైస్తవులే లేని గ్రామంలో 11 చర్చిలు ఏ విధంగా సాధ్యం? అసలు అధికారులు ఆ చర్చిలకు ఏవిధంగా అనుమతి మంజూరు చేశారు? ఆ చర్చిలను నిర్వహిస్తున్నవారు, ఆ చర్చిలకు వెళ్తున్నవారు తమను తాము క్రైస్తవులుగా నమోదు చేసుకోవడం లేదన్న విషయం మనకు తెలుస్తుంది. ఇది ప్రభుత్వాలను మోసగించడం కాక మరేమిటి? అసలు అటువంటి సందర్భాల్లో ప్రభుత్వ అధికారులు సదరు చర్చిలకు ఏవిధంగా అనుమతులు మంజూరు చేస్తున్నారు? ఈ నేరంలో వాళ్ళుకూడా పాత్రధారులే అన్నది ఇక్క స్పష్టమవుతోంది.

నివేదిక నుండి గ్రహించిన మరొక ఉదాహరణ చూద్దాం.. గత ఏపీ ప్రభుత్వం క్రైస్తవుల కోసం ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు అని సమాచార హక్కు చట్టం కింద కోరిన ప్రశ్నకు.. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగివున్న ప్రతి వ్యక్తిని ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ పధకం కింద లబ్దిదారుగా ఎంపిక చేస్తామంటూ గుంటూరు జిల్లా అచంపేట్ మండల రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను తెలియజేస్తుంది. ఎస్సీ కుల ధ్రువీకరణ కలిగిన వారు క్రైస్తవులు ఎలా అవుతారు?

క్రైస్తవ మతమార్పిడులను కట్టడి చేసే విధానాలేవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించడం లేదన్న విషయం ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.

ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ జనాభాపై కొన్ని వార్తా ఛానెళ్లలో పాస్టర్లు చేస్తున్న వ్యాఖ్యలు అనేక అనుమానాలు కలుగజేస్తున్నాయి. రాష్ట్రంలో 30% క్రైస్తవులు ఉన్నారని కొందరు బహిరంగంగా చెప్తుంటే.. 2 కోట్ల మంది క్రైస్తవులు, 5 లక్షల పాస్టర్లు కలిసి 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటూ ఏపీ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో ఓకే ఎమ్మెల్యేకు చేసిన సన్మాన కార్యక్రమం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

2011 జనాభా గణన అధికారిక లెక్కల ప్రకారం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6.82 లక్షలుగా ఉన్న క్రైస్తవ జనాభా ఈ 9 సంవత్సరాలలో ఏకంగా 2 కోట్లకు ఎలా చేరుతుంది? దీని బట్టి చూస్తే మతం మారిన క్రైస్తవులు తమ రిజర్వేషన్ల లబ్ది కోసం జనాభా గణనలో తప్పుడు లెక్కలు చూపుతున్నట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులు ఏమైపోతున్నారు?: 

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులు ఏమైపోతున్నారు?” (What happened to Christians of AP) అంటూ ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ సంస్థ తయారుచేసిన నివేదిక ఇక్కడ గమనించాలి. ఎస్సీ రిజర్వేషన్లు ఏవిధంగా దుర్వినియోగం అవుతున్నాయి అనే విషయాన్ని ఆ నివేదిక బయటపెట్టింది.

1971 నుండి 2011 కాలంలో రాష్ట్రంలోని క్రైస్తవ జనాభా ఏవిధంగా తగ్గుతూ వచ్చింది, అదే సమయంలో రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఏవిధంగా వృద్ధిచెందిందో అది తెలుపుతుంది.  విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాల్లో రిజర్వేషన్లు పొందే ఉద్దేశంతో క్రైస్తవంలోకి మారినప్పటికీ అధికారిక రికార్డుల్లో ఆ విషయాన్ని తెలియజేయకుండా దాచిపెడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు, తమకు విషయం తెలిసిన ప్రభుత్వ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనకు అర్ధమవుతుంది.

దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపితే స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద అవినీతిగా తేలుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకుని ఈ వ్యవహారంపై సమగ్ర కసరత్తు చేసి, అక్రమ మతమార్పిళ్లు, రిజర్వేషన్ల దుర్వినియోగం అరికట్టేందుకు కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ, అందుకోసం ఒక నిజనిర్ధారణ కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపాల్సిందిగా ఫోరమ్ తమ నివేదికలో కోరింది.

Source: VSK Telangana