బిజెపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పతంగి రామస్వామి (85) మృతి చెందారు. ఆయనకు భార్య సాధనాబాయి, కుమారుడు పి మాణిక్‌రావు, 5గురు కూతుళ్లు ఉన్నారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితం అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ రామస్వామి బుధవారం సాయంత్రం మృతి చెందారు.
గోషామహల్ నియోజకవర్గానికి చెందిన రామస్వామి 1965లో స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేటర్‌గా గెలిచారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చే వరకు తన గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేశాడు. గడ్డం పెంచడంతో స్థానికు ఆయన్ను ముద్దుగా గడ్డం రామస్వామి అని పిలిచేవారు.
1983లో మహారాజ్ గంజ్ నియోజకవర్గం నుంచి టిడిపి ఎమ్మెల్యేగాఘన విజయం సాధించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో 1985లో నాదెండ్ల భాస్కర్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో సాంకేతిక విద్యా మంత్రిగా పనిచేశారు. 1999లో మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌పై బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నాటి నుంచి రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు.
మాజీ మంత్రి పి.రామసామి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా నిరాఢంబరమైన జీవితం గడిపిన రామస్వామి, నిజాయితీగా ప్రజలకు సేవలందించి మచ్చలేని రాజకీయ నాయకుడిగా పేరొందారని కొనియాడారు.
రామస్వామి మృతి పట్ల ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. తొలి తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా సేవలందించిన ఆయన విద్యార్థి దశ నుంచే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేశారని, రాష్ట్ర ఏర్పడేంత వరకు గడ్డం తీయనని 1969లో దీక్ష చేపట్టారని అంటూ ట్వీట్ చేశారు.
రామస్వామి గారి మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. పాతబస్తీలో ఘర్షణలు జరిగినప్పుడు రామస్వామి అక్కడ పర్యటించి ప్రజల్లో ధైర్యం నింపేవారని, మజ్లిస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నా వారితో విభేదించారని దత్తాత్రేయ తెలిపారు. రామస్వామి నీతికి నిజాయితీకి మారుపేరని, రాజకీయ జీవితంలో మచ్చ లేని నాయకునిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.
ధైర్యసాహసాలకు మారుపేరని, సమస్యల పైన పోరాటం చేయడం సాధించడం పట్ల రామస్వామి ప్రధానంగా దృష్టి సారించేవారని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్ రావు నివాళులు అర్పించారు. బిజెపి పక్ష నేతగా శాసనసభలో తనకు నిరంతరం సహాయ సహకారాలు అందించేవారని గుర్తు చేసుకున్నారు.
మృదుస్వభావి. నిరాడంబరుడు, అతి సామాన్య జీవితం గడిపిన వ్యక్తి రామస్వామి అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంతాపం ప్రకటించారు. నిరు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని బుల్లెట్ పై తిరుగుతూ బుల్లెట్ రామస్వామి గా పేరుగాంచిన వ్యక్తి అని పేర్కొన్నారు.
More Stories
స్కామ్‌లకు అడ్డాగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం
స్థానిక బిసి రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు
సీఎం హామీలకు విలువ లేకుండా పోయింది