132 ఏళ్ల చరిత్రకు సాక్ష్యం సచివాలయం నేలమట్టం 

132 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచినా  తెలంగాణ రాష్ట్ర సచివాలయం నేలమట్టమైనది. నిజాం నవాబు నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్‌ వరకు పరిపాలనా కేంద్రాలుగా సచివాలయ భవనాలు విరాజిల్లాయి. 
 
పాత సచివాలయాన్ని కూల్చివేసి, దాని స్థానంలో కొత్త సచివాలయంను నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవిస్తూ, ఈ అంశంపై దాఖలైన పిటిషన్లన్నింటినీ రాష్ట్ర హైకోర్టు కొట్టేసిన విషయం విదితమే. సచివాలయ కూల్చివేతపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి వేల మంది పోలీసుల పహారాలో.. 20 బుల్డోజర్లు, 500 మంది కూలీలతో బిల్డింగ్లను హడావుడిగా నేలమట్టం చేయడం ప్రారంభించారు. 
కూల్చివేతను వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారేమోనన్న ఉద్దేశంతో సచివాలయానికి నాలుగు వైపుల ఉన్న రహదారులను మూసివేశారు. మరోవైపు నూతన సచివాలయానికి శంకుస్థాపన చేసి దాదాపు ఏడాది కావస్తున్నది. డి-బ్లాక్‌ సమీపంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ అప్పట్లో శంకుస్థాపన చేశారు.
 
 వచ్చే ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి కొత్త సచివాలయంలో కొలువుదీరాలన్న లక్ష్యం దిశగా పనులను వేగంగా చేపడుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ నగర సీపీ అంజనీకుమార్‌ కూల్చివేత పనులను పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది.  భవనాల కూల్చివేత నేపథ్యంలో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురుకాకుండా బీఆర్కేభవన్‌లోని అన్ని కార్యాలయాలకు ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది.
 
పాత సచివాలయం కూల్చివేతను మొదట ‘సీ’ బ్లాక్‌ నుంచి ప్రారంభించారు. ఆ దిశగా రాకపోకలను నిషేధించి, ట్రాఫిక్‌ను మళ్లించారు. భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.  ఇప్పటివరకు దాదాపు అన్ని భవనాల పైభాగాలను కూల్చివేసినట్టు తెలిసింది. 
 
పురాతన కట్టడమైన మింట్‌ కాంపౌండ్‌ స్టోన్‌ బిల్డింగ్‌  మంగళవారం నేలమట్టమయ్యింది. వందల ఏండ్ల క్రితం నిర్మించిన ఈ భవనం స్థానంలో ఒకప్పుడు మొదటి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఉండేది. మొన్నటివరకూ ఈ భవనంలో ఉన్న విద్యుత్‌శాఖ కార్యాలయాలను మార్చి నెలలోనే వేరే చోటుకు తరలించారు.   రెండు మూడు రోజుల్లో అన్ని భవనాలను నేలమట్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శిథిలాల తరలింపును నెలాఖరుల్లా పూర్తి చేయనున్నట్లు సమాచారం.
 
పాత సచివాలయం కూల్చివేత పనులు పూర్తికాగానే కొత్త సచివాలయం‌ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఏడాదిలోగా దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.500 కోట్ల వ్యయమవుతందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఈ మొత్తాన్ని ప్రభుత్వం రుణ  రూపంలో సమకూర్చుకుంది. ఆరు లక్షల చదరపు అడుగుల్లో నూతన సచివాలయాన్ని నిర్మించనున్నారు.