టిటిడి ఉద్యోగులంద‌రికీ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు

గ‌త 28 రోజులుగా అనేక ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నా టిటిడిలో 17 మంది సిబ్బందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వీరంద‌రినీ క్వారంటైన్‌కు పంపి అత్యుత్త‌మ వైద్య‌సేవ‌లు అందించ‌డానికి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశామని 
ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. 
 
వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జరిగిన ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అత్య‌వ‌స‌ర స‌మావేశం  అనంతరం మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులంద‌రికీ క‌రోనా నిర్ధార‌ణ పరీక్ష‌లు చేయిస్తామని ప్రకటించారు.  అయితే  స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఏ ఒక్క భ‌క్తుడికీ క‌రోనా పాజిటివ్ రాలేద‌ని స్ప‌ష్టం చేశారు 
కాగా, దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి సంబంధించి రోజువారీ భ‌క్తుల సంఖ్య‌ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పెంచ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్రకటించారు.  భ‌క్తుల కోరిక మేర‌కు ఆన్‌లైన్ ద్వారా స్వామివారి క‌ల్యాణోత్స‌వం సేవ ప్రారంభించే విషయం గురించి అర్చకులతో చర్చించి తగు నిర్ణ‌యం తీసుకుంటామని చెప్పారు.
ఉద్యోగుల్లో మ‌నోధైర్యం పెంచ‌డానికి ఎంత ఖ‌ర్చు అయినా వెనుకాడ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధికారుల‌ను ఆదేశించింది. ఉద్యోగుల‌కు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అండ‌గా ఉంటుంది. ఉద్యోగుల‌తో చ‌ర్చించి, అన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తూ భ‌క్తుల‌కు సేవ చేయ‌డం కోసం శాస‌న‌స‌భ్యులు భూమ‌న క‌రుణాక‌రరెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డిలకు బాధ్య‌తలు అప్ప‌గించాం.
తిరుమ‌ల‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగులకు ప్ర‌స్తుతం వారానికోసారి షిఫ్టు అమ‌లు చేస్తుండగా, ఉద్యోగుల ఆరోగ్యసంర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఇక‌పై షిఫ్టు విధుల‌ను రెండు వారాల‌కు పెంచాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యం తీసుకుంది.
 
క‌ల్యాణ‌క‌ట్టలో క్షుర‌కులు, త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే భ‌క్తుల ఆరోగ్యసంర‌క్ష‌ణలో భాగంగా క్షుర‌కులు ఒక భ‌క్తుడి త‌ల‌నీలాలు తీయ‌డానికి ఒక‌ గ్లౌజు చొప్పున వినియోగించేలా, క్షుర‌కుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండే పిపిఈ కిట్లు అందిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. 
శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం త‌రువాత ఉత్స‌వ‌మూర్తుల వాహ‌నాన్ని మోసే వాహ‌న‌బేర‌ర్ల‌కు మాస్కులు, గ్లౌజులు త‌ప్ప‌నిస‌రి చేయాలని, వాహ‌నాన్ని మోసేందుకు వాడే తండ్ల‌ను(క‌ర్ర‌లు) ప్ర‌తిరోజూ శానిటైజ్ చేయాలని నిర్ణయించారు.