అంతర్జాతీయ కోర్టులో గెలిచిన భారత్‌

ఇటలీ నౌకా సిబ్బంది కాల్పుల కేసుపై అంతర్జాతీయ కోర్టులో భారత్‌ విజయం సాధించింది. కేరళ మత్స్యకారులపై కాల్పులు జరిపి ఇద్దరి మృతికి కారణమైన ఇటలీ ఆయిల్‌ ట్యాంకర్‌ నౌకకు చెందిన ఇద్దరు నిందితుల నుంచి పరిహారం రాబట్టవచ్చని గురువారం తీర్పు ఇచ్చింది. 

హేగ్‌లోని మధ్యవర్తిత్వ కోర్టు ఈ కేసుపై విచారణ జరిపి భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం తెలిపారు.

2012 ఫిబ్రవరి 15న కేరళ తీరానికి సమీపంలో ఉన్న ఇటలీ ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక ‘ఎన్రికా లెక్సీ’కి చెందిన సిబ్బంది సాల్వటోర్ గిరోన్, మాసిమిలియానో లాటోరే భారత మత్స్యకారుల పడవపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులు చనిపోయారు. 

దీంతో ఇటలీ నౌకకు చెందిన ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసి హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, అనారోగ్య కారణాలతో సుప్రీంకోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేయడంతో ఇటలీకి వెళ్లిపోయారు.