ప్రస్తుత సచివాలయంలోని భావనాలను పడగొట్టి, కొత్త సచివాలయం నిర్మించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు హై కోర్ట్ లో ఉన్న అడ్డంకులు తొలగి పోవడంతో కొత్త సచివాలయం నిర్మాణంకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కసరత్తు ప్రారంభించారు. కొత్త సచివాలయం నిర్మాణానికి జూలై నెలాఖరులోగా (శ్రావణమాసం)లో శంకుస్థాపన చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలిసింది.
దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఆర్థికశాఖ నుంచి ‘రైట్ ఆఫ్’ వచ్చే అవకాశం ఉందని, దీనికి సంబంధించి ఆర్ అండ్ బి అధికారులు ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపనున్నట్టుగా తెలిసింది. ఆ తరవాత ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
ఈ నేపథ్యంలోనే కూల్చివేతలకు సంబంధించిన తేదీలను సిఎం కెసిఆర్ ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సచివాలయం కూల్చివేతపై ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంను కూల్చివేసి కొత్తది కట్టుకోవడానికి అనుమతించింది.
ఈ నేపథ్యంలో కొత్త సచివాలయాన్ని ఆధునిక హంగులతో నిర్మించడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇది విధానపర నిర్ణయం కావడంతో కోర్ట్ జోక్యం చేసుకోలేదన్న ప్రభుత్వ వాదనతో హై కోర్ట్ అంగీకరించింది. రెండు రోజులలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ విషయమై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ చరిత్ర, ప్రతిష్టను చాటే విధంగా భవన నిర్మాణ నమూనాను రూపొందించాల్సిందిగా స్వయంగా కెసిఆర్ ప్రముఖ ఆర్కిటెక్ట్‌లకు గతంలో సూచించారు. సిఎం విజ్ఞప్తి మేరకు స్పందించిన కొంతమంది ఆర్కిటెక్టులు ప్రముఖ డిజైన్లను సిఎంకు పంపించారు. సిఎం కెసిఆర్ సచివాలయ నిర్మాణానికి సంబంధించి కొత్త డిజైన్లను ఇప్పటికే ఎంపిక చేసినట్టుగా తెలిసింది.
ప్రస్తుతం సచివాలయ నిర్మాణానికి సుమారు రూ.450 కోట్ల అంచనాతో కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేసిన మంత్రివర్గ ఉపసంఘం, సాంకేతిక కమిటీలు గత సంవత్సరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.
More Stories
తెలంగాణలో ఏపీ క్యాడర్ అధికారుకు ఏపీ వెళ్లాలని ఆదేశం
వర్గీకరణకు కమిషన్ పేరుతో ఉద్యోగ భర్తీకి ఎగనామం!
ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్