కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం  

ఉగ్రవాదులకు నిలయంగా మారిన జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో హిజ్బుల్ ముజాహిదిన్ క‌మాండ‌ర్ మ‌సూద్ అహ్మ‌ద్ భ‌ట్‌ కూడా ఉన్నారు.

దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా ఖుల్‌చోహార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతాదళాలు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. అయితే పోలీసులు, భద్రతా బలగాలపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలు ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని పోలీసులు తెలిపారు. వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో తెలియరాలేదని, గాలింపు కోనసాగుతున్నదని వెల్లడించారు.

హిజ్బుల్ క‌మాండ‌ర్ అహ్మద్ భ‌ట్‌తో పాటు ఇద్దు ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన‌ట్లు జ‌మ్మూక‌శ్మీర్ పోలీసు చీఫ్ దిల్‌బాగ్  సింగ్ మీడియాతో తెలిపారు. మ‌సూద్ ఓ రేప్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.  దోడా పోలిస్ స్టేష‌న్‌లో అత‌నిపై కేసు ఉన్న‌ది. అప్ప‌టి నుంచి అత‌ను ప‌రారీలో ఉన్నాడు.   కోక‌ర్‌నాగ్‌, త్రాల్‌, క్రీవ్ ప్రాంతాల్లో ఉన్న 29 మంది విదేశీ ఉగ్ర‌వాదుల‌ను త్వ‌ర‌లోనే హ‌త‌మార్చ‌నున్న‌ట్లు ఐజీ విజ‌య్‌కుమార్ తెలిపారు.

జూన్‌ 26న పుల్వామా జిల్లాలోని చెవా ఉలార్‌ సమీపంలోని త్రాల్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెటాయి. జమ్ముకశ్మీర్‌లో వారం రోజుల వ్యవధిలో సుమారు 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 

ఇలా ఉండగా, కశ్మీర్‌, ట్రాల్‌ ప్రాంతంలో ఈ ఏడాది 100మందికిపైగా ఉగ్రవాదులను ఏరిపారేసి వాటిని మిలటరీ ఫ్రీ జోన్లుగా మార్చామని కేంద్ర హోంవ్యవహారాల శాఖ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. ఇది రక్షణదళాలు సాధించిన గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు.