భారత్‌కు మళ్లీ జీఎస్పీ హోదా!

భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా పునరుద్ధరణపై పరిశీలన జరుపుతున్నట్టు అమెరికా వెల్లడించింది. ఈ విషయమై భారత్‌తో చర్చలు జరుపుతున్నట్టు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అమెరికా చట్టసభ ప్రతినిధులకు తెలిపారు. 
 
ట్రంప్‌ సర్కార్‌ గతేడాది జూన్‌లో భారత్‌కు జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌ (జీఎస్పీ) హోదాను రద్దు చేసింది. దీనికి ప్రతిగా అమెరికా నుంచి దిగుమతయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ సుంకాలను పెంచింది. ఫలితంగా అమెరికాకు తీవ్ర నష్టం జరుగుతున్న విషయాన్ని ఆ దేశ చట్టసభ ప్రతినిధులు తెరపైకి తీసుకొచ్చారు. 
 
దీనికి అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైటైజర్‌ బదులిస్తూ భారత్‌కు జీఎస్పీ పునరుద్ధరించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. భారత్‌ నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే జీఎస్పీ పునరుద్ధరణకు వేగంగా అడుగులు పడతాయని చెప్పారు. అంతేకాకుండా భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకొనేందుకు చర్చలు జరుపుతున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.