భారత్ భూభాగం ఆక్రమణకే  చైనా కుట్ర 

చైనా కుట్ర‌పూరితంగానే గాల్వ‌న్ లోయ వ‌ద్ద భార‌త సైనికుల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగింద‌ని అమెరికా సెనేట‌ర్ మెక్‌క‌న్నెల్ ఆరోపించారు.  భార‌త భూభాగాన్ని ఆక్ర‌మించ‌డానికే 1962 యుద్ధం త‌ర్వాత చైనా మ‌ళ్లీ అతి తీవ్ర‌మైన ఘ‌ర్ష‌ణ‌కు దిగింద‌ని పేర్కొన్నారు.

సెనేట్‌లో విదేశీ విధానం గురించి జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడుతూ చైనా దురాక్ర‌మ‌ణ ఉద్దేశంతోనే స‌రిహ‌ద్దుల్లో హింసకు పాల్ప‌డే ప్ర‌య‌త్నం చేసింద‌ని క‌న్నెల్ చెప్పారు. అణ్వాయుధాలు క‌లిగిన రెండు దేశాల మ‌ధ్య త‌లెత్తిన ఈ ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌ను మిగిలిన ప్ర‌పంచ‌మంతా ఎంతో ఆందోళ‌న‌తో గ‌మ‌నిస్తోంద‌ని, శాంతికోసం ప్రపంచ దేశాలు కాంక్షిస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

చైనా తీరుతో అమెరికా, దాని మిత్ర దేశాల‌కూ ముప్పు ఉంద‌ని ఆయన హెచ్చరించారు. క‌రోనా మ‌హ‌మ్మారిని వాడుకుని హాంకాంగ్‌ను త‌న చెప్పుచేత‌ల్లో పెట్టుకునే ప్ర‌య‌త్నం చేసింద‌ని, ఈ రీజియ‌న్‌లో త‌న పెత్త‌నం కోసం పాకులాడుతోంద‌ని చెప్పారు. భూభాగంతో పాటు స‌ముద్రం, ఆకాశంలోనూ దురాక్ర‌మ‌ణ‌ల‌కు చైనా య‌త్నిస్తోంద‌ని దుయ్యబట్టారు. 

 జ‌పాన్‌కు చెందిన సెంక‌కు ద్వీపాల‌ను, థైవాన్ గ‌గ‌న‌త‌లాన్ని త‌న సొంతం అని చెప్పుకుంటోంద‌ని తెలిపారు. చైనా త‌న సొంత భూభాగంలోని ప్ర‌జ‌ల‌ను సైతం హింసిస్తోంద‌ని, అంత‌ర్జాతీయంగా అస్థిర‌త సృష్టించి, ఏకంగా ప్ర‌పంచ ప‌టం రూపురేఖ‌ల‌ను మార్చాల‌ని కుట్ర‌లు చేస్తోంద‌ని చైనా ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం మెక్‌క‌న్నెల్ వ్య‌క్తం చేశారు.