ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు  

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు  

కరోనా ఉధృతి దృష్ట్యా ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులు అంతా పాస్ అయినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్ విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

 మొత్తం 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన పరీక్షలను వచ్చే నెల 10 నుండి జరపడం కోసం అన్ని సన్నాహాలు చేసినప్పటికీ పరిస్థిత్తుల తీవ్రత దృష్ట్యా రద్దు చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

పొరుగున ఉన్న తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో ఈ పరీక్షలను రద్దు చేయడంతో ఏమైనా జరపాలనే మొండి వైఖరితో పోతున్న ఏపీ ప్రభుత్వం పట్ల వత్తిడి రావడం, పైగా రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రత పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.  

ముఖ్యంగా విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుండి పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వంపై వత్తిడులు వస్తున్నాయి. దీంతోపాటు వచ్చే నెల 11 నుండి జరుప తలపెట్టిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్టు  మంత్రి ప్రకటించారు.

ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, పంజాబ్ తదితర  రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.