గాల్వాన్ లోయ ఘర్షణ ఘటనతో ఆగ్రహంగా ఉన్న భారత ప్రభుత్వం చైనాకు బుద్ధి చెప్పేందుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌లో చైనా ఉత్పత్తులను వాడొద్దని ఆదేశాలు జారీ చేయగా, ఇప్పుడు రైల్వేశాఖ కూడా రంగంలోకి దిగింది. ప్రముఖ చైనా కంపెనీకి ఇచ్చిన కీలక కాంట్రాక్టును రైల్వేశాఖ రద్దు చేసుకుంది.
చైనాకు చెందిన బీజింగ్ నేషనల్ రైల్వే రిసెర్చ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ గ్రూప్ కో లిమిటెడ్‌కు అప్పగించిన రూ.471 కోట్ల కాంట్రాక్టును డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రద్దు చేసేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ సెక్షన్ వరకు 417 కిలోమీటర్ల మేర సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటుకు రైల్వేశాఖ చైనా కంపెనీకి 2016లో కాంట్రాక్టు అప్పజెప్పింది. నాలుగేళ్లలో కాంట్రాక్టును పూర్తి చేయాల్సి ఉండగా, 20 శాతం పని మాత్రమే పూర్తయ్యిందని రైల్వే శాఖ అసహనం వ్యక్తం చేసింది.
పనుల్లో పేలవ పురోగతి కనబర్చినందుకు కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్టు పేర్కొన్నది. అంతేకాకుండా, టెక్నికల్ డాక్యుమెంట్లు సమర్పించడంలో అలసత్వం ప్రదర్శించినందకు, పని చేసే చోట కంపెనీకి చెందిన ఇంజినీర్లు గానీ, అధికారిక యంత్రాంగం గానీ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే, ఎక్కడ కూడా గాల్వాన్ ఘటన వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ వెల్లడించలేదు. పనులు సజావుగా జరగనందుకే కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్టు పేర్కొన్నది.
More Stories
రెండో అతిపెద్ద 5 జి స్మార్ట్ఫోన్ మార్కెట్గా భారత్
సగానికి పైగా విదేశీ పెట్టుబడులు మహారాష్ట్రకే
భారత్ స్వయంగా అనేక ‘సింగ్పూర్’లను సృష్టిస్తోంది