గల్వాన్‌ నదిపై వంతెన నిర్మించిన భారత్ 

చైనా ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ భారత్‌ పైచేయి సాధించింది. గల్వాన్‌ నదిపై 60 మీటర్ల మేర వంతెన నిర్మాణాన్ని ఎట్టకేలకు పూర్తి చేసింది. దీంతో ఆ ప్రాంతంపై భారత సేనలకు  పట్టుసాధించేందుకు అవకాశం ఏర్పడింది. 

ష్యోక్ నది, గాల్వన్ నది సంగమానికి మూడు కిలోమీటర్ల దూరంలో, పెట్రోలింగ్ పాయింట్ 14కు సమీపంలోని బైలీ వంతెనకు తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త వంతెన నిర్మాణం జరిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఇది వరకు ఇక్కడ కాలి నడక వంతెన ఉండేదని, దాని స్థానంలో కాంక్రీట్‌ వంతెనను ఆర్మీ, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన ఇంజనీర్లు నిర్మించినట్లు పేర్కొన్నారు.

కాగా ఈ వంతెన నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చైనా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆర్మీ ఇంజినీర్లు వెనక్కి తగ్గలేదు. ఈ నెల 15న గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14వద్ద భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ముఖాముఖి ఘర్షణకు ఈ నిర్మాణమే ప్రధాన కారణం. ఈ ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌బాబుతో సహా 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

ఈ ఘర్షణ జరిగినప్పటికీ ఆర్మీ ఇంజినీర్లు వంతెన నిర్మాణంపై వెనక్కి తగ్గలేదు. మిగిలిన పనులను వెంటనే పూర్తి చేశారు. దీంతో ఈ ప్రాంతంలో కీలకమైన ఈ వంతెన భారత్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇకపై భారత దళాలు ఈ వంతెన మీదుగా గల్వాన్‌ నదిని దాటి ఆ వైపు ప్రాంతానికి సులువుగా చేరుకోవచ్చు. 

చైనా తమదిగా చెప్పుకుంటున్న గల్వాన్‌ నదీ ప్రాంతంతో పాటు కరాకోరం పాస్‌కు దక్షిణంగా ఉన్న చివరి సైనిక పోస్టు డార్బుక్ నుండి దౌలత్ బేగ్ ఓల్డీ వరకు ఉన్న 255 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారిని కూడా రక్షించుకోవచ్చు.