అమెరికాలో ఎతైన హనుమాన్ విగ్రహం

అమెరికాలో భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది అమెరికాలోనే ఎత్తైన హిందూ దేవతా విగ్రహం. ఢెలావేర్ రాష్ట్రంలో 25 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఇది పూర్తి ఏకశిలా విగ్రహం. దీనిని ఈ నెల 11న ప్రతిష్టించారు. 

డెలావర్ లో ఉన్న ఎత్తైన విగ్రహాలలో ఇది రెండవది. మొదటిది న్యూ కాజిల్‌లోని హోలీ స్పిరిట్ చర్చిలో లేడీ క్వీన్ ఆఫ్ పీస్ విగ్రహం. దాని తరువాత తాజాగా ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహం డెలావేర్ లోని రెండవ అతిపెద్ద మత విగ్రహం.

ఈ విగ్రహంను నల్ల గ్రానైట్ తో దక్షిణ భారత్ లోని ఒక చిన్న గ్రామంపై చెందిన 12 మంది కళాకారులు చెక్కారు. దీనిని చెక్కడానికి దాదాపు ఒక సంవత్సర కాలం పట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది. గత జనవరిలో ఈ విగ్రహం న్యూయార్క్ కు చేరుకోగా తర్వాత ఒక పెద్ద లారీ ద్వారా డెలావేర్ కు చేర్చారు.

విగ్రహాన్ని శిల్పకారుడు తయారు చేసి ఆలయానికి అందజేసిన తరువాత ఆలయ పూజారులు సాధారణంగా 5 నుండి 10 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. వాటిలో ఎక్కువగా అగ్నిహోమాలు ఉంటాయి’అని విశ్వ హిందూ దేవాలయాల సంఘం అధ్యక్షుడు పాటిబండ శర్మ తెలిపారు. 

ఆదివారం నాడే ఈ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. సోమవారం నాడు సీతారామ కళ్యాణం జరుపుతున్నారు. అయితే ఈ కల్యాణాన్ని ఆన్ లైన్ లో మాత్రమే చూడవచ్చు. కాగా, కరోనావైరస్ విజృంభిస్తోన్న కారణంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ట వేడుకలలో ఎక్కువ మంది పాల్గొనలేరని పేర్కొన్నారు.