ప్రస్తుతం అమెరికన్లపైనే కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న పది దేశాల్లో నాలుగు ఉత్తర, దక్షిణ అమెరికాలోనే ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడు మైక్ ర్యాన్ తెలిపారు. మధ్య, దక్షిణ అమెరికాలలో వైరస్ విజృంభిస్తున్నదని చెప్పారు.
ముఖ్యంగా బ్రెజిల్ లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఆ దేశ వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఉన్నదని, దవాఖానాల్లో 90 శాతం పథకాలు నిండిపోయాయని చెప్పారు. మెక్సికోలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు లాక్ డౌన్ నుంచి బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని గుర్తు చేశారు.
ఆర్థిక సంక్షోభం కారణంగా దేశాలపై ఒత్తిడి ఉన్నదని, ఈ నేపథ్యంలో ప్రజలను ఇంటికే పరిమితం చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. అయితే ఇదంత సులభం కాదని చెప్పారు.
మరోవైపు, డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి టెడ్రోస్ మాట్లాడుతూ ప్రమాదకరమైన ఈ వైరస్ పట్ల ప్రపంచం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐరోపాలో తగ్గినప్పటికీ మిగతా చోట్ల కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. ఏ వాక్సిన్ అయినా అన్ని దేశాలు పంచుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
More Stories
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
కెనడాలో వెయిటర్ ఉద్యోగాలకై వేల మంది భారతీయుల క్యూ
బతుకమ్మకు అమెరికాలో అధికారిక గుర్తింపు