తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కు కరోనా సోకినట్లుగా వైద్యాధికారులు ఆదివారం నిర్ధరించారు. దీంతో ఎమ్మెల్యేను హైదరాబాద్ తరలిస్తున్నట్లుగా సమాచారం.
రెండు రోజుల క్రితం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన సతీమణితో సహా మరో ముగ్గురికి కరోనా అని తేలింది. తాజాగా మరో ఎమ్మెల్యేకు సైతం కరోనా సోకడంతో కలకలం రేపుతుంది.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో వారం కిందటే బాజిరెడ్డి ప్రైమరీ కాంటాక్ట్ అయినట్టు తెలిసింది. అంతేకాకుండా మూడు రోజుల నుంచి ఎమ్మెల్యే బాజిరెడ్డి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో నిన్న బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు, ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
పరీక్షల్లో బాజిరెడ్డికి పాజిటివ్, భార్యకు నెగెటివ్ రావడంతో ఆయన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. మరోవైపు ఎమ్మెల్యే కుటుంబసభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు.
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో పరిస్థితి తీవ్రంగా ఉండగా శనివారం మరో 18 జిల్లాల్లోనూ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 253 కేసులు నమోదయ్యాయి. వీటిలో 179 గ్రేటర్ హైదరాబాద్‌వే. వీటితో శనివారం నాటికి రాష్ట్రంలో నమోదైన కొవిడ్ 19 కేసులు 4737 కు చేరుకున్నాయి.
మూడుసార్లు రోజువారీ కేసులు 200 మార్కు దాటాయి. గత ఐదు రోజుల్లోనే 995 మంది కొవిడ్ బారినపడ్డారు. 13 రోజుల్లో 2,039 కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 156 మందికి వైరస్ సోకింది. శనివారం మృతి చెందిన 8 మందితో ఈ నెలలోనే వందమంది ప్రాణాలు కోల్పోయినట్లైంది. రోజుకు సగటున ఏడుగురు మరణించారు.
More Stories
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి
ఒకవైపు ప్రజాపాలన దినోత్సవాలు.. మరోవైపు విముక్తి దినోత్సవాలు
రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుకు రూ 30 లక్షల ధర