ఉత్తర తెలంగాణ అభివృద్ధికి బెంచ్ మార్క్ ‘ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్’

ఉత్తర తెలంగాణ అభివృద్ధికి బెంచ్ మార్క్ ‘ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్’
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ మంజూరు కావడం కేవలం ఒక జిల్లాకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, ఇది ఉమ్మడి ఉత్తర తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఒక గొప్ప అవకాశంగా మారబోతోందని ఆదిలాబాద్ బిజెపి శాసనసభ్యులు పాయల్ శంకర్ తెలిపారు.  నీతి ఆయోగ్ (ప్రణాళికా సంఘం) లెక్కల ప్రకారం దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా ఉన్న ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ మంజూరు కావడం శుభ పరిణామమని చెప్పారు. 
 
ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేస్తూ రూ. 2,278 కోట్లు కేటాయించగా, రక్షణ శాఖ తరఫున మరో రూ. 3,000 కోట్లు వ్యయం చేయనున్నారని తెలిపారు. మొత్తంగా దాదాపు రూ. 5,500 కోట్ల భారీ వ్యయంతో డిఫెన్స్ (రక్షణ శాఖ), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) భాగస్వామ్యంలో “జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్”గా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త మైలురాయిని అధిగమించిందని హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ బీజేపీని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తమదని హామీ ఇచ్చారని పాయల్ శంకర్ గుర్తు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలుగా బీజేపీ అభ్యర్థులు గెలిచిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ సభను ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసి, జిల్లా వెనుకబాటుతనాన్ని, ఇక్కడి అవసరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. 
 
వేదికపై ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా ప్రధాని మోదీ స్పష్టమైన దిశానిర్దేశం చేశారని తెలిపారు. అపారమైన ఖనిజ సంపద, సారవంతమైన నేలలు, కష్టపడే రైతులు, గిరిజనులు, బీసీ జనాభా కలిగిన ఆదిలాబాద్ జిల్లా గత పాలకుల అలసత్వం వల్లే వెనుకబడిందని, 2014-15లోనే నాటి రక్షణ మంత్రి  నిర్మలా సీతారామన్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి 10కి పైగా ఉత్తరాలు రాసినా వారు స్పందించలేదని మండిపడ్డారు. 
 
తదనంతరం అసెంబ్లీలో తాను అనేకసార్లు దీనిపై గళమెత్తానని, కేంద్రంలో సంబంధిత శాఖలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగామని తెలిపారు.
హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్‌ను ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం జరిగిందని పాయల్ శంకర్ వెల్లడించారు. ఇప్పటికే 2,200 ఎకరాల భూసేకరణకు జీవో రాగా, మరో 6,000 ఎకరాలకు క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని చెప్పారు. 
 
ఒకపక్క ఎయిర్‌పోర్ట్, మరోపక్క ఇండస్ట్రియల్ కారిడార్ రావడంతో ఆదిలాబాద్ ముఖచిత్రం మారడమే కాకుండా నేషనల్ లాజిస్టిక్ హబ్‌గా, ట్రైపోర్ట్ కార్గో టెర్మినల్‌గా రూపాంతరం చెందుతుందని తెలిపారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద పత్తి మార్కెట్ కలిగిన ఆదిలాబాద్‌లో టెక్స్‌టైల్, ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు అభివృద్ధి చెందుతాయని, ట్రైబల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, అడవులు-నదులతో నిండిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టూరిజం రంగానికి గొప్ప ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ మంజూరు చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ,  కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రామ్మోహన్ నాయుడు, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు, అలాగే సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ ప్రజల తరఫున పాయల్ శంకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి సమక్షంలో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.