కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఒక వంక విద్య సంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుందో, తరగతులు ఎప్పుడు ప్రారంభం కాగలవో ప్రభుత్వం తేల్చలేని పరిస్థితులు నెలకొనగా కార్పొరేట్ కళాశాలలు మాత్రం ఆన్‌లైన్ పాఠాలు అంటూ విద్యార్థుల నుండి భారీ ఫీజుల వసూలుకు శ్రీకారం చుట్టుతున్నాయి.
‘తరగతులవారీగా విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ క్లాసుల కోసం రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ వెంటనే ఆన్‌లైన్ పాఠాలకు లింక్ ఇస్తాం. ఆపై పాఠాలు వినండి. లేదంటే వెనకబడిపోతారు’ అంటూ ప్రైవేటు, కార్పొరేటు కళాశాలలు వాట్సాప్ సందేశాలు, ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రకటనలతో ఊదరగొడుతున్నాయి.
రాష్ట్రంలో కొవిడ్-19 నేపథ్యంలో సాధారణ పరిస్థితులు వచ్చేవరకు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యాసంవత్సరం ప్రారంభంకావడం అసాధ్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం గురించే కాకుండా ఆన్‌లైన్ తరగతుల గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు.
అయితే, రాష్ట్రంలో 1-9 తరగతుల, పదో తరగతి విద్యార్థులను ప్రభుత్వం నేరుగా పైతరగతులకు ప్రమోట్‌చేయడంతో ప్రైవేటు కార్పొరేట్లు విద్యాసంవత్సరాన్ని అప్పుడే ప్రారంభించాయి. ఆన్‌లైన్ పాఠాలు సాగుతున్నాయని ప్రచారం చేస్తున్నాయి. జూలై మొదటివారంలో ఎంసెట్, జూలై మూడో వారంలో ఐఐటీ-జేఈఈ, నాలుగోవారంలో నీట్ పరీక్షలు జరుగనున్నాయి.
ప్రవేశ పరీక్షల కోసం ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తున్నామని, స్వల్పకాలిక కోర్సులు సిద్ధమని ఇంటర్ విద్యార్థులను ఆకర్శిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇవ్వలేదని ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది.
కాలేజీలకు సంబంధించిన రెన్యువల్ ప్రక్రియ పూర్తయ్యేందుకు జూలై నెలాఖరు వరకు సమయం పట్టొచ్చని బోర్డు కార్యదర్శి సయ్యద్‌ఒమర్ జలీల్ ఇప్పటికే పేర్కొన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో నిర్వహించే ప్రవేశాలు చెల్లుబాటుకావని బోర్డు అధికారులు స్పష్టంచేశారు. గుర్తింపు లేని కాలేజీల్లో తొందరపడి ప్రవేశాలు పొందవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.
More Stories
స్థానిక బిసి రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు
సీఎం హామీలకు విలువ లేకుండా పోయింది
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం