రాజకీయ క్రీడలో వలస కార్మికులు… సమిష్టి కృషి అవసరం

రాం మాధవ్

తన జనరల్ థియరీని ప్రతిపాదించిన ఎనిమిది దశాబ్దాల తరువాత కూడా జాన్ మేనార్డ్ కీన్స్ చాలా మంది ఉదార ఆర్థికవేత్తలకు ఓ దైవాంశసంభూతుడు (డెమిగోడ్) గా కొనసాగాడు. కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) కారణంగా కష్టాల బారిన పడిన వలస కార్మికులకు  కీన్స్ యొక్క “ట్రికిల్-అప్” సిద్ధాంతం ఒక సర్వరోగనివారిణిలా పనిచేయగలదని వారి విశ్వాసం. క్రియారహితమైన ఆర్థిక వ్యవస్థను వెంటనే పునః ప్రారంభించటానికి ప్రభుత్వం పన్నులు తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం, మధ్యతరగతి జేబుల్లో డబ్బు పెట్టడం ద్వారా డిమాండ్ పెంచాలని కీన్స్ సూచించాడు.

ప్రతిపక్షంలోని కీన్స్ శిష్యులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీని పేదల ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయలేదంటూ  విమర్శిస్తున్నారు. వలస కార్మికులతో సహా గ్రామీణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గణనీయమైన సహాయాన్ని అందించింది. రబీ పంటను ప్రభుత్వం రూ 75,000 కోట్ల  వ్యయంతో కొనుగోలు చేసింది. ఇది తొమ్మిది కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. అదనంగా, ‘పిఎం కిసాన్’ కింద అర్హతగల రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తంగా రూ 19,000 కోట్లు జమ చేశారు. రూ 6,000 కోట్ల పంట భీమా బిల్లు చెల్లించారు. 20.05 కోట్లకు పైగా పేద కుటుంబాలకు చెందిన మహిళలు తమ జన ధన్ ఖాతాల్లో మూడు నెలల్లో రూ 1,500 పొందుతున్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం లక్ష కోట్ల రూపాయిలను కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించటంతో  గ్రామీణ పేదలకు 300 కోట్ల పనిదినాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ చర్యలన్నిటి ద్వారా ప్రతి పేద కుటుంబం యొక్క ఖాతాల్లోకి సుమారు రూ 12,000 నేరుగా వెళ్లినట్లు ఆర్థికవేత్తల అంచనాలు సూచిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ సహకారం అందిస్తున్నప్పటికీ, ఈ నిధులన్నీ కేంద్రం నుండి వచ్చాయి.

అయినప్పటికీ, వలస కార్మికులు పెద్ద ఎత్తున ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల నుండి ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, చ్చత్తీస్గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లోని తమ సొంత గ్రామాలకు తరలిపోవటంతో ఎన్నో బాధలు కనిపిస్తున్నాయి. దీనిపై చాలా రాజకీయాలు జరుగుతున్నాయి.

ఇటువంటి పరిస్థితులలో వలసదారుల సమస్య సంక్లిష్టంగా ఉంది. ఇది భారతదేశంలో మాత్రమే ఉన్న సమస్య కాదు. ఐరోపాలోని స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి అనేక దేశాలు పంట కోత  కాలంలో తూర్పు యూరోపియన్ దేశాల నుండి వలస వచ్చిన వ్యవసాయ కార్మికుల సమస్యలతో సతమతమౌతున్నాయి. “పంటలు పోతాయనే భయం, వలస కార్మికులు కరోనా వ్యాధిని మోసుకొస్తారేమోననే  భయం,  మహమ్మారికి ముందు నుంచే ఉన్న మరో భయం – విదేశీయులే ఉపాధి అవకాశాలన్నిటినీ హస్తగతం చేసుకుంటారేమోనన్న భయం, ఈ భయాలన్నిటి మధ్య వలస కార్మికులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలు నలిగి పోతున్నాయి. ఆర్ధిక పతనం రాజకీయ పోరాట గీతలను స్పష్టం చేయటంతో జనరంజక రాజకీయవాదులు తమ అవకాశాలను చూసుకొంటున్నారు” అంటూ ది గార్డియన్ పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

భారతదేశంలో 13 కోట్లకు పైగా వలస జనాభా ఉంది. వారంతా మూకుమ్మడిగా తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్ళటం ఉపశమింపచేయటానికి వీలుకాని విపత్తుగా పరిణమిస్తుంది. దీనిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై దృష్టి సారించింది. భారతదేశ శ్రామిక శక్తిలో 44% పైగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు.

శ్రామిక శక్తి ఉత్పాదక వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉండేలా చూడటం కోసం వ్యవసాయ ఉత్పత్తులను రైతులనుండి నేరుగా కొనుగోలు చేసే మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను లక్ష కోట్లు రూపాయిలను  కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన ఉపాధి అవకాశాల్లో 70% ఉద్యోగాలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం అందిస్తోంది. ఈ రంగానికి తేలికగా అప్పు తీసుకొనే అవకాశాలను కల్పించటం కోసం  రూ 4 లక్షల కోట్ల మేరకు కేటాయించి ప్రభుత్వం దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

జి-20 కూటమిలోని ఇతర దేశాలు తీసుకున్న ఆర్థిక చర్యలతో పోలిస్తే, భారతదేశం చాలా దేశాలకంటే కంటే మెరుగైన పనే చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నివేదిక ప్రకారం, మొత్తం ఆర్థిక చర్యలు జిడిపిలో శాతాన్ని బట్టి రెండు కోణాలలో చూడవచ్చు – మొదటిది ఖర్చు, ఆదాయ చర్యలు; రెండవది రుణ, ఈక్విటీ, హామీ చర్యలు. ఆర్థిక ఉపశమన చర్యలు తీసుకొన్న దేశాల్లో అగ్రగామిగా ఉన్న జర్మనీ జిడిపిలో ఒక శాతం అదనపు ఖర్చు రూపేణా, ఆరు శాతం రుణ హామీల రూపేణా ప్రకటించింది. జిడిపిలో 10% మేర ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన భారత్, జి 20 లోని తోటి దేశాలకంటే కంటే చాలా ముందుంది.

వలస వచ్చిన వారిలో ఓ భాగం వారి స్వగ్రామాలకు తిరుగుముఖం పట్టగా, వలస కార్మికులలో పెక్కు మంది ప్రస్తుతం ఉన్న చోటనే ఉండిపోయారన్నది గమనార్హం. దానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, వేతనాలు చెల్లించడం కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యజమానులకు విజ్ఞప్తి చేయటం; రెండవది, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు;  వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ఉద్దీపన చర్యలు ప్రకటించటం.

లాక్ డౌన్  సమయంలో వలస కార్మికులకు రాష్ట్రాలు, ప్రభుత్వేతర సంస్థలు సహాయాన్ని అందిస్తున్నాయి. అయినప్పటికీ, కుటుంబాలను కలుసుకోవాలి, సొంత గ్రామాలకు తిరిగి వెళ్లిపోవాలన్న వారి ఆందోళన కారణంగా చాలా మంది లాక్ డౌన్ ను ధిక్కరించి,  సొంత ఊర్లకు తిరుగుముఖం పట్టారు. ఈ వలస కార్మికుల తిరుగు ప్రయాణం క్రమబద్ధంగా నడవాలంటే, కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల మధ్య అలాగే వారు ఎక్కడ నుండి ప్రయాణం మొదలు పెడుతున్నారో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు, వారి గమ్య స్థానాలున్న రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం. 1,200 బస్సుల్లో సొంత రాష్ట్రానికి చెందిన వారినే కాకుండా పొరుగున ఉన్న బిహారీయులను కూడా వెనుకకు తెచ్చే ఏర్పాటు చేయటం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉదాహరణగా నిలచింది. ఒక్క ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రమే 20 లక్షల మందికి పైగా కార్మికులను వారి గమ్యస్థానాలకు స్వీకరించటమో, రవాణా చేయటమో చేసింది.

వలసదారుల కోసం గుజరాత్ త్వరిత గతిన రైళ్లను ఏర్పాటు చేయగా, మహారాష్ట్ర తగు ఏర్పాట్లు చేయటంలో వెనుకబడింది. ఈ ఏర్పాట్లు చేయటంలో భారతీయ రైల్వే గణనీయ పాత్ర పోషిస్తూ, మే చివరి వారం నాటికీ ఇరవై లక్షలకు పైగా వలసదారులను వారి సొంత రాష్ట్రాలకు రవాణా చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ రాష్ట్రాలకు చెందిన వలసదారులను స్వీకరించడానికి ముందులో తగినంత ఆసక్తి చూపక పోవటంతో, ముంబై, ఢిల్లీ లలో భారీ సంఖ్యలో వలసదారులు చిక్కుకుపోయాయి. వలసదారులు ప్రారంభ రాష్ట్రమో లేక వారి గమ్యస్థానాలున్న రాష్ట్రమో కానప్పటికీ మధ్యప్రదేశ్ రాష్ట్రం, వలస కార్మికులు తమ గమ్య స్థానాలను చేరుకొనేందుకు గాను వేయి బస్సులను సమకూర్చటానికి ముందుకు వచ్చింది.

వ్యవసాయ కార్మికులు దేశాల మధ్య సరిహద్దులను స్వేచ్ఛగా దాటే పరిస్థితులుండాలంటూ జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఐర్లాండ్ మాజీ ప్రధాని లియో వరద్కర్ కొన్ని వారాల క్రితం యూరోపియన్ యూనియన్ నాయకులతో గొంతు కలిపారు. కానీ సొంత దేశం ఐర్లాండ్ లో మాత్రం స్ట్రాబెర్రీలను కోయటానికి బల్గేరియన్ కార్మికులను తీసుకువచ్చినందుకు డబ్లిన్ పండ్ల కంపెనీని విమర్శించాడు. అదేవిధంగా, మన దేశంలో ప్రతిపక్షాలు వలస కార్మికులు ప్రస్తుతమున్న ప్రాంతాలు లేదా వారి గమ్య స్థానాలు తమ పాలిత రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ  వలస కార్మికుల సంక్షోభానికి కేంద్రాన్నే విమర్శిస్తున్నాయి. మనం ఇపుడు చూస్తున్న పరస్పర నిందారోపణలు రాజకీయ క్రీడ కాకుండా, వలస కార్మికుల సంక్షోభాన్ని  పరిష్కరించడానికి భారత్ సమాఖ్య దేశంగా సమిష్ఠి కృషి చేయటం ఈనాడు మన అవసరం.

(రాం మాధవ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ గోవేర్నర్స్ సభ్యులు. వ్యాసంలో అభిప్రాయాలు వ్యక్తిగతం.)