కోర్ట్ వివాదాలతో గాలికి జగన్ పాలన!

అధికారం లోకి వచ్చిన సంవత్సరంలోనే ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు అనేకం ఉన్నత న్యాయస్థానాల ముందుకు రావడం, కీలకమైన పలు ఉత్తరువులను, నిర్ణయాలను హై కోర్ట్ కొట్టి వేయడం, సుప్రీం కోర్ట్ కు వెళ్లినా ప్రయోజనం లేకపోవడం ఒక విధంగా రికార్డు. 
పాలనా నిబంధనలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా గత ఏడాది కాలంగా కోర్ట్ లలో మొట్టికాయలు వేయించు కోవడంలో ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారని చెప్పవలసిందే.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వం స్వల్ప కాలంలో ఇన్నేసి వ్యయపర వివాదాలను కొని తెచ్చుకోవడం విస్మయం కలిగిస్తుంది. పైగా ఈ కేసులలో ఏది కూడా ప్రజా ప్రయోజనంతో సంబంధం గలవి లేకపోవడం గమనార్షం. అత్యధికంగా రాజకీయ కక్షసాధింపు చర్యలుగా ప్రజలు భావించే పరిస్థితులు నెలకొన్నాయి.

అహంకార పూర్వక నిర్ణయాలు, ఏకపక్ష విధానాల కారణంగా పరిపాలనను గాలికి వదిలివేసి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు సహితం వీటిల్లో చాల నిర్ణయాలను హర్షించడం లేదు. తొందరపాటు నిర్ణయాలుగా విచారం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం: 

ఎస్‌ఇసి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఇసి) పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించడంతోపాటు రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి స్థాయి వ్యక్తిని ఆ స్థానంలో నియమించేందుకు ఎన్నికల సంస్కరణలు చేపడుతూ పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం  జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొని హైకోర్టు కొట్టేసింది. దానిపై సర్కారు సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. విచారణ జరగాల్సి ఉంది.

విశాఖ భూములు, స్థలాల వేలం: పేదలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు ఆరు వేల ఎకరాలను పూలింగ్‌ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లోని తొమ్మిది స్థలాలను ఇావేలం వేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను సైతం నిలిపేసింది.
ఆంగ్ల మాధ్యమం: ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 6 తరగతుల విద్యార్ధులకు ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధన ఉండాలంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 85ను కోర్టు కొట్టేసింది. విద్యాహక్కు చట్టం, రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొంది. ప్రభుత్వం  ఇప్పుడు సుప్రీం కోర్ట్ ను ఆశ్రయిస్తున్నది. 


అమరావతి మాస్టర్‌ప్లాన్‌పై: రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తూ మార్చి 10న ప్రభుత్వ గెజిట్‌-355 జారీని కోర్టు నిలిపేసింది.

వైసిపి రంగులు: పంచాయతీరాజ్‌ భవనాలకు వైసిపి రంగులు వేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు తీర్పు చెప్పగా దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినా ఫలితం లేకపోయింది. రంగుల తొలగింపునకు సమయం అడగ్గా హైకోర్టు అంగీకరించింది. అయితే వైసిపి మూడు రంగులూ అలాగే ఉంచి అదనంగా మట్టిరంగును చేరుస్తూ జీవో 623 ఇవ్వడంపై కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. 
 
ఆ జీవోను కొట్టేయడమే కాకుండా సిఎస్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌లకు కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. దానిపై ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్‌ వేయగా తాజాగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది.

ఎల్‌జి పాలిమర్స్‌: విశాఖలో ఎల్‌జి పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజి సంఘటనపై హైకోర్టు సూమోటోగా విచారణ చేపట్టింది. ఎల్‌జి పాలిమర్స్‌ను సీజ్‌ చేయాలని, అందులోని ఏ వస్తువులు బయటికి వెళ్లకుండా ఉత్తర్వులిచ్చింది. పిల్‌ విచారణలో ఉంది. ఎల్‌జి పాలిమర్స్‌ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆక్షేపించింది.

అమరావతి ఉద్యమం: అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఉద్యమిస్తున్న ఆ ప్రాంత మహిళలు, రైతులపై పోలీసుల నిర్భందంపై హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. డిజిపి స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. విజిలెన్స్‌ కమిషనరేట్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలించే జీవోలను కోర్టు నిలిపేసింది. రాజధాని కార్యాలయాలు తరలిస్తే ఆ ఖర్చులను అధికారుల జేబుల నుంచి వసూలు చేస్తామని హెచ్చరించింది.

రెండు సిబిఐ విచారణలు: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. కరోనా సమయంలో తమకు మెడికల్‌ కిట్లు ఇవ్వట్లేదంటూ ఆరోపించిన డాక్టర్‌ సుధాకర్‌ సస్పెన్షన్‌ వ్యవహారం నడుస్తుండగా ఆయనపై విశాఖ పోలీసుల అనుచిత ప్రవర్తనపై సూమోటోగా విచారించిన హైకోర్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది.

చంద్రబాబుకు నోటీస్‌: విపక్ష నేత చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా సిఆర్‌పిసి సెక్షన్‌ 151 కింద ఆయనకు నోటీసు ఇచ్చి అరెస్టు చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది.

కోర్టు ధిక్కరణ నోటీసులు: వైసిపి ప్రభుత్వంకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు వెలువరిస్తోందంటూ కోర్టులపైనా, న్యాయమూర్తులపైనా అనుచిత వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ఫుల్‌ కోర్టు, వైసిపి ఎంపి, మాజీ ఎమ్మెల్యే సహా పలువురికి నోటీసులిచ్చింది.

ఎబి వెంకటేశ్వరరావుపై చర్య: టిడిపి హయాంలో రక్షణ పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఎబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ చర్యను హైకోర్టు నిలుపుదల చేసింది. ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌పై చర్యను సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఆపేసింది.