కరోనా పరీక్షలపై తెలంగాణ హైకోర్టు అక్షింతలు

తెలంగాణలో కరోనా టెస్ట్‌ల‌పై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ‌ హైకోర్టు మంగ‌ళ‌వారం విచారణ జ‌రిపింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

కరోనా పరీక్షలు జరుగుతున్న తీరుపై మరోసారి అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో చాలా తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారని ప్ర‌శ్నించింది. లక్షణాలు లేని హైరిస్క్ అవకాశాలున్న వారికి పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది.

ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకి వలస వచ్చినవారిలో ఎంతమందికి కరోనా పరీక్షలు చేశారో కోర్టుకు వెంటనే తెలియజేయాలని సూచించింది. మార్చి 11 నుంచి ఇప్పటివరకు చేసిన టెస్టుల వివరాలను జూన్ 4 లోగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

కరోనా పరీక్షలపై కేంద్రం రెండు సార్లు రాసిన లేఖలు సమర్పించాలని, కరోనా రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో తెల‌పాల‌ని చెప్పింది. అంతేకాకుండా ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించింది.