ప్రధాని మోదీకి బ్రెజిల్‌ అధ్యక్షుడు ఫోన్‌

ప్రధాని మోదీకి బ్రెజిల్‌ అధ్యక్షుడు ఫోన్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన వేళ కీలక పరిణామం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డా సిల్వా ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ మేరకు ఇరుదేశాలు ప్రకటనను విడుదల చేశాయి. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, ప్రజా సంబంధాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే ఓ ప్రణాళికకు ప్రధాని మోదీ అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 

“ఈ చర్చల సందర్భంగా భారత్‌-బ్రెజిల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి భిన్న అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. తదుపరి సంప్రదింపులు జరిపేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు” అని పేర్కొంది.

మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ఏకపక్ష సుంకాలపై ఇరువురు నేతలు చర్చించిటన్లు బ్రెజిల్ అధ్యక్ష కార్యాలయం ప్రకటనలో తెలిపింది. “ఇప్పటివరకు తీవ్రంగా ప్రభావితమైన దేశాలు బ్రెజిల్‌, భారత్‌లు మాత్రమే. బహుపాక్షికతను కాపాడుకోవడం, ప్రస్తుత పరిస్థితుల్లో సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం, ఇరుదేశాల మధ్య సమగ్ర భాగస్వామ్యం కోసం అవకాశాల అన్వేషణను పునరుద్ఘాటించాం'” అని బ్రెజిల్‌ అధ్యక్ష కార్యాలయం చెప్పింది.

అంతకుముందు సమస్యల పరిష్కారంపై చర్చల కోసం ఎప్పుడైనా కాల్‌ చేయొచ్చని ట్రంప్‌ ఇచ్చిన ఆఫర్‌ను బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా తోసిపుచ్చారు. ట్రంప్‌, పుతిన్‌ తప్ప మోదీ, జిన్‌పింగ్‌ సహా ఇతర దేశాధినేతలు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఇలా స్పందించిన కొన్ని గంటలకే ప్రధాని మోదీకి లూలా ఫోన్‌ చేయడం గమనార్హం.  ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్​పై 50 శాతం సుంకాలను విధించారు. రష్యాతో వాణిజ్యం జరపుతున్నందనే కారణంతో ఈ సుంకాలను విధించారు. చైనా తర్వాత అత్యధిక సుంకాలు విధించిన దేశం భారత్​. మరోవైపు రష్యాతో భారత్​ కీలక చర్చలు జరపుతుంది.

భారతదేశం-బ్రెజిల్ భాగస్వామ్యం గ్లోబల్ సౌత్ సహకారంలో కీలకమైన భాగం. బ్రిక్స్, జి20 వంటి బహుపాక్షిక వేదికలలో రెండు దేశాలు ప్రభావవంతమైన పాత్రలను పోషిస్తున్నాయి. వారి పెరుగుతున్న సమన్వయం ప్రపంచ ఆర్థిక పాలన, దౌత్య సమతుల్యతపై అర్థవంతమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. పరస్పర ఆసక్తి ఉన్న వివిధ ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు.  సన్నిహితంగా ఉండటానికి అంగీకరించారు.