
దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి తమ ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గత గత 11 ఏళ్లల్లో పారదర్శకత, సున్నితమైన ప్రజా కేంద్రీకృతమైన పాలనా నమూనాను భారత్ చూసిందని తెలిపారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కర్తవ్య భవన్‌ను మోదీ ప్రారంభిస్తూ “కర్తవ్య భవన్ దేశ అభివృద్ధికి మార్గదర్శిగా ఉండబోతుంది. దేశానికి కీలకమైన నిర్ణయాలు ఇక్కడ నుంచే తీసుకోబడతాయి” అని చెప్పారు.
“ఈ భవనాల ద్వారా దేశాన్ని పేదరికం నుంచి విముక్తి చేయడంలో ఓ సాధనంగా ఉపయోగపడతాయి. వికసిత భారత్ కూడా సాకారం చేస్తుంది. కర్తవ్య అంటే కేవలం భవనం కాదు. అది కోట్లాది భారతీయుల కలలను సాకారం చేసే పవిత్ర స్థలం. దశాబ్దాలుగా ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం బ్రిటిష్ కాలం నాటి భవనాల్లో కొనసాగింది. వాటిల్లో తగిన విధంగా ఆఫీసులకు అవసరమైన వెలుగు, గాలి, విస్తీర్ణం లేవు” అని మోదీ పేర్కొన్నారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని నిర్మిస్తోంది. ఇక నుంచి కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పెట్రోలియం, డీఓపీటీ, ఎంఎస్ఎంఈ శాఖలు కర్తవ్య భవన్ నుంచి కార్యకలాపాలు సాగించనున్నాయి. ఇందులో మెుత్తం 10 భవనాలు రానుండగా మూడో భవనం కర్తవ్య భవన్ నిర్మాణం పూర్తైంది. దీనిని సీసీఎస్-త్రీగా వ్యవహరిస్తున్నారు.
1.05 లక్షల చదరపు అడుగుల్లో కర్తవ్య భవన్ నిర్మించారు. ఒకేసారి 600 కార్లను పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో జిమ్, కెఫటేరియా, క్యాంటీన్, చికిత్సా కేంద్రం తదితరాలు ఉన్నాయి. ఒక్కోదానిలో 45 మంది కూర్చునేలా 24 కాన్ఫరెన్స్ హాళ్లు, 67 సమావేశ గదులను నిర్మించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పని చేసేలా అత్యాధునిక వసతులను కల్పించారు. ఏడాదికి 5.34 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సీసీఎస్-ఒకటి, సీసీఎస్-రెండు భవనాలు వచ్చే నెలకి పూర్తికానున్నాయి. సీసీఎస్-10 భవనం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. 7వ భవనం వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రణాళిక కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త పార్లమెంట్ భవనం, వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌ను నిర్మించింది.
విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉన్న కర్తవ్య మార్గాన్ని అభివృద్ధి చేసింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌తో పాటు ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌ను కూడా నిర్మించనుంది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నూతన కార్యాలయం, క్యాబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌ను నిర్మించనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ రెండో దశలో ప్రధానమంత్రి కొత్త నివాసాన్ని సైతం నిర్మించనున్నారు.
More Stories
యూరియా ఎక్కువ వాడితే కాన్సర్… వాడకం తగ్గిస్తే కట్టకు రూ. 800
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత
ఆసియా కప్ 2025లో పాక్ ను మట్టికరిపించిన భారత్