మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూత

మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూత

జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సత్యపాల్‌ మాలిక్‌ (79) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఆయన పనిచేశారు. ఆయన జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే ఆర్టికల్‌ 370 రద్దు జరిగింది.  సత్యపాల్‌ మాలిక్‌ 1946 జూలై 24న ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ జిల్లాలోని హిసావాడ గ్రామంలో జన్మించారు. ఆయనది జాట్‌ కుటుంబం. మీరట్‌ విశ్వవిద్యాలయం నుండి సైన్స్‌, ఎల్‌ఎల్‌బిలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచి ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. 1968-69లో మీరట్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

1974-77 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. 1980-1986, 1986-89 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.  రాజకీయ నాయకుడిగా తన అర్ధ శతాబ్దపు జీవితంలో, అనేక పార్టీలలో చేరారు. పశ్చిమ యుపిలోని బాగ్‌పత్ నుండి వచ్చిన ఆయన మొదట చౌదరి చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్ టికెట్‌పై ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో, చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్‌దళ్ ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసింది.

కానీ 1984లో, ఆయన కాంగ్రెస్‌లో చేరారు, అది ఆయనను 1986లో రాజ్యసభకు పంపింది. బీజేపీలో చేరిన తర్వాత 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనను బీహార్ గవర్నర్ గా పంపింది. కొద్దికాలం ఒడిశా గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. తర్వాత ఆయనను జమ్మూ కాశ్మీర్ కు, అక్కడి నుండి గోవా, మేఘాలయాలకు పంపారు.  క్రియాశీల రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ, బహిరంగంగా మాట్లాడే వ్యక్తిగా పేరుగాంచిన ఆయన వివాదాలకు కొత్తేమీ కాదు.  

2019 పుల్వామా దాడిపై, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రభుత్వంపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు.  సత్యపాల్‌ మాలిక్‌పై కిష్టార్‌లోని కిరు జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రం టెండర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ప్రాజెక్టు సివిల్‌ వర్క్స్‌ కోసం పటేల్‌ ఇంజినీరింగ్‌ సంస్థకు చెందిన ఫైల్‌ను ఆమోదించేందుకు రూ.300 కోట్లు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సత్యపాల్‌ మాలిక్‌పై సీబీఐ చార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేసింది.