రాహుల్ వద్ద అణుబాంబు ఉంటె పేలనిద్దాం!

రాహుల్ వద్ద అణుబాంబు ఉంటె పేలనిద్దాం!

రాహుల్‌గాంధీ దగ్గర అణు బాంబు ఉంటే పేల్చనిద్దామని, కానీ ఆ పేలుడులో ఎలాంటి హాని జరగకుండా ఆయనను ఆయన కాపాడుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్  ఎద్దేవా చేశారు. “రాహుల్‌గాంధీ తన దగ్గర ఆటమ్‌ బాంబు ఉందంటున్నాడు. ఉంటే ఒకసారి ఆయన దాన్ని పేల్చాలి. అయితే ఆ పేలుడు ఎలాంటి హాని జరగకుండా ఆయనను ఆయన కాపాడుకోవాలి” అని హితవు చెప్పారు.

అధికార బీజేపీకి మేలు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని, అందుకు సంబంధించి తన దగ్గర అణు బాంబు లాంటి సాక్ష్యం ఉందని శుక్రవారం కాంగ్రెస్‌ ఎంపీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపైరాజ్‌నాథ్‌ సింగ్ తీవ్రంగా స్పందించారు.  అధికార బీజేపీ కోసం ఈసీ ఓట్ల చౌర్యానికి పాల్పడుతుందంటున్న రాహుల్‌గాంధీ తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని రక్షణ మంత్రి హెచ్చరించారు.

లేదంటే శనివారం పూట నిప్పుతో ఆడుకోవడమైనా ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్లో భూకంపం సృష్టించబోతున్నాడని గతంలో కూడా ఆయన మనుషులు హంగామా చేశారని రాజ్‌నాథ్‌ గుర్తుచేశారు. కానీ రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడినా ఎలాంటి భూకంపం రాలేదని, పైగా ఆ ప్రసంగం తడిచిన పటాసు లెక్క తుస్సుమన్నదని ఎద్దేవా చేశారు. 

రాహుల్ చేసిన వ్యాఖ్యలు కేవలం సంచలనానికి మాత్రమే పరిమితమవుతున్నాయని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నేతగా రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని పేర్కొంటూ రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు చెప్పారు.

బీహార్‌లో ఎన్నికల జాబితా సవరణ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని, ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ చేతికి ఎమర్జెన్సీ రక్తపు మరకలు ఉన్నాయని రాహుల్‌గాంధీ గుర్తుపెట్టుకోవాలని, వైరిపక్షాలపై నోటికొచ్చిన ఆరోపణలు మానుకోవాలని రాజ్‌నాథ్‌ హితవుపలికారు.