ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిపై బిఆర్ఎస్ దాడి చేసే ఖబడ్దార్!

ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిపై బిఆర్ఎస్ దాడి చేసే ఖబడ్దార్!
ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిపై బీఆర్ఎస్ మూకలు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసుల నంచి సమాచారం అందటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు . ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సంస్థలపై గులాబీ శ్రేణుల దాడులు దుర్మార్గమని పేర్కొంటూ మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 
తక్షణమే ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థలకు రక్షణ కల్పించాలని బీజేవైఎం కార్యకర్తలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా తప్పుగా రాస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని బీజేపీ నేత స్పష్టం చేశారు. ఇకపై మీడియా సంస్థలపై, అమాయక ప్రజలపై దాడులు చేశారో ఖబడ్దార్.. అంతు చూస్తామని హెచ్చరించారు. 
 
మీడియా సంస్థలను బీజేపీ గౌరవిస్తోందని చెబుతూ కావాలని తప్పుడు వార్తలు రాస్తే చట్ట, న్యాయపరంగా ముందుకు వెళతామే తప్ప దాడులు చేయబోమని చెప్పారు. ఎందుకంటే వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవించే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ‘మీడియా సంస్థలపై దాడులు చేశారో ఖబడ్దార్… టీ న్యూస్ అంతు చూస్తాం’ అంటూ బీఆర్‌ఎస్‌ నేతలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హెచ్చరించారు.

అలాగే పాతబస్తీ సల్కం చెరువు భూమిలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కట్టిన కాలేజీలో వేల మంది పిల్లలు చదువుతున్నందున వారి జీవితాలను నాశనం చేయలేమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్‌కు ఒక న్యాయం, అట్టడుగు పేదలకు ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ కాలేజీల్లో చదివే వాళ్ల జీవితాలే ముఖ్యమా ?అని నిలదీశారు. 

మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది పేదల జీవితాలు పట్టవా? అని మండిపడ్డారు. కష్టపడి చెమటోడ్చి ఇండ్లు కట్టుకున్న మధ్య తరగతి ప్రజలు బతుకులు లెక్కలేవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్ కాలేజీ భవనాన్ని కూల్చివేస్తారా? లేదా? లేకపోతే ప్రజల పక్షాన ఆ పని తామే చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రామచందర్‌ రావు అల్టిమేటం జారీ చేశారు.

కాగా, జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను తమ పార్టీ ఒక సవాలుగా తీసుకుంటోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు చెప్పారు. బలమైన ప్రతిపక్షం బరిలో ఉంటే ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడం సాధ్యం కాదని ఆయన చెప్పారు.  రానున్న 25 రోజుల్లోనే బీజేపీ పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని రామచందర్‌రావు వెల్లడించారు.

పార్టీలోని ముఖ్య నేతలతో చర్చించి, అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీలో ఎటువంటి వర్గాలు లేవని, అందరూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఐక్యంగా పనిచేస్తారని ఆయన వివరించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ పెద్దగా దృష్టి సారించలేదని, అయితే ఈసారి వాటిపైనా ప్రత్యేకంగా దృష్టి పెడతామని పేర్కొన్నారు.