బిహార్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం కీలక ప్రకటన చేసింది. ముందుగా జారీ చేసిన ఆదేశాల మేరకు కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. క్షేత్ర స్థాయి నుంచి పకడ్బందీగా చేస్తున్నామని, నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవని తేల్చి చెప్పింది. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో ఈ ప్రక్రియలో మార్పులు చేసినట్లు వస్తున్న వార్తల క్రమంలో ఈసీ స్పష్టత ఇచ్చింది.
ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్లు 2025 జులై 25లోగా ఎప్పుడైనా తమ పత్రాలను ఇవ్వొచ్చని చెప్పింది. ఒకవేళ పత్రాలు ఇవ్వకపోతే అభ్యంతరాల పరిశీలన సమయంలో కూడా అందించవచ్చని సూచించింది. ఈ ప్రక్రియలో మార్పులపై వస్తున్న వార్తలను నమ్మవద్దని, తప్పుడు సమాచారంతో ప్రజలను అయోమయానికి గురిచేయవద్దని కోరింది. 2025 జూన్ 24న కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు జరుగుతుందని తేల్చిచెప్పింది. ఓటర్ జాబితా ముసాయిదా 2025 ఆగస్టు 1 నాటికి విడుదల చేస్తామని తెలిపింది. పాత ఓటర్లు పత్రాలు సమర్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పింది.
మరోవైపు ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. బిహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కుకోవడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శించింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి చేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు. ప్రత్యేక సమగ్ర సవరణపై తొలి రోజు నుంచి కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడుతుందని తెలిపారు.
“అనేక సంవత్సరాలుగా ఓట్లు వేస్తున్న ప్రజలు ఇప్పుడు పత్రాలు చూపించమని అడుగుతున్నారు. పేదలు, బలహీనులు, దళితులు, వెనుకపడిన వర్గాల ప్రజల ఓటు హక్కులను బలవంతంగా లాక్కోవడానికి బీజేపీ- ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తుంది. ఈ ప్రక్రియ వల్ల దాదాపరు 8 కోట్ల మంది ప్రజలపై ప్రభావం పడుతుంది” అంటూ విమర్శించారు.
కాగా, ఇప్పటికే ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సవరణ కోసం జూన్ 24న ఈసీ జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేయాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఈ పిటిషన్ వేసింది. అయితే, విదేశీ అక్రమ వలసదారులు, అనర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించి అర్హులైన పౌరులకు మాత్రమే ఓటు హక్కు కల్పించడం కోసం ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టినట్లు ఎన్నికల సంఘం చెబుతోంది.
కానీ, ఈసీ ఉత్తర్వు భారత రాజ్యాంగంలోని 14, 19, 21, 325, 326 అధికరణలను, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, ఓటర్ల నమోదు నిబంధనలు-1960లోని నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని ఏడీఆర్ విమర్శించింది. ఎన్నికల సంఘం సరైన విధానాన్ని పాటించకపోవడం, సంబంధిత పత్రాల సమర్పణకు తగినంత సమయం ఇవ్వకపోవడం, తక్కువ వ్యవధి వల్ల లక్షల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఏడీఆర్ అభిప్రాయపడింది.

More Stories
వినేష్ ఫోగట్ సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం
సిజెపి ఎక్స్ ఖాతా పునరుద్ధరించేందుకు హైకోర్టు తిరస్కారం
రాహుల్, శివకుమార్ లపై సిద్దరామయ్య బిసి జనగణన పిడుగు!