
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు జైషే మహ్మద్ ముఠా అధినేత మసూద్ అజార్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌లు పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని భారత్ ఎన్నిసార్లు చెబుతున్నా ఆ దేశం మాత్రం దాన్ని అంగీకరించట్లేదు. తాజాగా ఆ దేశ మాజీ మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో కూడా మరోసారి అసత్యాలు పలికారు. మసూద్ అజార్ ఎక్కడున్నాడో తమకు తెలియదని చెబుతూ అతడు పాక్‌లో ఎక్కుడున్నాడో భారత్ చెబితే సంతోషంగా అరెస్టు చేస్తామంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “పాకిస్థాన్‌తో జరిగే సమగ్ర చర్చల్లో ఉగ్రవాదం కూడా ఒకటి. దీనిని అరికట్టే విషయంలో చేసే ఎలాంటి చర్యలనైనా పాక్ వ్యతిరేకించదు. ఉగ్రవాది హఫీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. అతడు పాకిస్థాన్ కస్టడీలోనే ఉన్నాడు” అని స్పష్టం చేశారు.
“ఇక, మసూద్ అజార్ విషయానికొస్తే అతడు ఎక్కుడున్నాడో మేం గుర్తించలేక అరెస్టు చేయలేకపోతున్నాం. గతంలో జరిగిన కొన్ని ఘటనలను గమనిస్తే బహుశా అతడు అఫ్గానిస్థాన్‌లో ఉండి ఉంటాడని భావిస్తున్నాం. ఒకవేళ అతడు పాకిస్థాన్ గడ్డ పైనే ఉన్నట్లు భారత ప్రభుత్వం మాకు కచ్చితమైన సమాచారం ఇస్తే మేం సంతోషంగా అతడిని అరెస్టు చేస్తాం. కానీ, న్యూఢిల్లీ ఆ వివరాలు ఇవ్వదు” అంటూ ఎద్దేవా చేశారు.
“ముఖ్యంగా వీరిపై దాఖలైన కేసులు ఉగ్రవాదానికి నిధులు అందించడం వంటి కేసులు ఉన్నాయి. ఇవన్నీ పాక్‌కు సంబంధించినవి. ఈ ఉగ్రవాదులపై నేరారోపణకు అవసరమైన కొన్ని ప్రాథమిక అంశాలను భారత్ పాటించట్లేదు. కోర్టుకు సాక్ష్యాలను సమర్పించడం, భారత్ నుంచి సాక్ష్యులు వచ్చి చెప్పడం, ప్రతి ఆరోపణలు చేయడం లాంటివి పాటించాలి. ఇందుకు భారత్ సిద్ధంగా ఉంటే వారిని అప్పగించడంలో ఎలాంటి అడ్డంకి ఉందని నేను భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.
ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా చేపట్టింది. పాక్, పీఓకేలోని జైషే, లష్కరే ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రముఠాల ప్రధాన కార్యాలయాలు ధ్వంసం అయ్యాయి. అంతేకాకుండా భారత్ దాడుల్లో తమ కుటుంబంలో 10 మంది చనిపోయారని మసూద్ అజార్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిణామాల వేళ భుట్టో తాజాగా చేసిన వ్యాఖ్యలు దాయాది ద్వంద్వ వైఖరికి అద్దం పడుతున్నాయి.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత అయిన మసూద్ అజార్ భారత్‌లో పలు భీకర ఉగ్రదాడులకు సూత్రధారి. అయితే అతడిని 1995లో భారత్ అరెస్టు చేసింది. కానీ, 1999లో కొందరు ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి మసూద్‌ను విడిపించుకున్నారు. ఆ తర్వాత అతడు జైషేను ఏర్పాటు చేశాడు. 2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి, 2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ ఇతడి పాత్ర ఉంది. 2019లో మసూద్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
గిరిజనుల కోసం డిజిటల్ వేదిక “ఆది సంస్కృతి” బీటా వెర్షన్