రైతు వేదికల నిర్మాణంలోసగం నిధులు కేంద్రానివే

కేసీఆర్  ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు ప్రారంభానికి ముస్తాబయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 1,580 వేదికల నిర్మాణం పూర్తయినట్లు పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. 
 
అయితే రైతు వేదికల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వీటి నిర్మాణానికి ఖర్చు చేస్తున్న నిధుల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఉపాధి హామీ నిధులు సగం ఉండడం గమనార్హం. కానీ ఎక్కడా కేంద్ర ప్రభుత్వ నిధుల గురించి సర్కారు ప్రస్తావించడం లేదు. తామే నిర్మిస్తున్నట్ల చెప్పుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం మొత్తం రూ.572.22 కోట్లు ఖర్చు చేస్తుండగా, ఇందులో రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి రూ. 312.12 కోట్లు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఎస్) నుంచి రూ. 260.10 కోట్లు కేటాయించారు. 
 
ఒక్కో వేదిక నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.12 లక్షలు ఉండగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.10 లక్షలు ఉండడం గమనార్హం.  గ్రామాల్లో 2,462 రైతు వేదికలు నిర్మిస్తుండగా, అర్బన్ ఏరియాల్లో 139 వేదికలను నిర్మిస్తున్నారు. వీటిలో పూర్తిగా దాతలు ఇచ్చిన విరాళాలతో 24 వేదికలు నిర్మిస్తుండడం విశేషం. 
 
ఈ వేదికలకు మిషన్ భగీరథ అధికారులు నల్లా కనెక్షన్, విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ మీటర్ కనెక్షన్ ఇచ్చారు.  రైతులకు పంటల సాగులో మెళకువలపై ట్రైనింగ్ ఇచ్చేందుకు, వారంతా ఒక చోట సమావేశమై తమ సమస్యలు, ఇబ్బందులను చర్చించేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 
సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేరుగా రైతులతో మాట్లాడేలా వీటిని నిర్మిస్తున్నారు. సమావేశాలు, చర్చలు నిర్వహించడంతోపాటు గోడౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వీటిని వినియోగించనున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను శనివారం మధ్యాహ్నం 12.30కు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు.