బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్‌ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు

బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్‌ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు
వచ్చే నెలలో బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్‌ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌లతో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇరాన్‌, ఈజిప్టు, ఇండోనేషియా నాయకులు హాజరవుతారని భావిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల కూటమి జి-7కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్‌ను అమెరికా భావిస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ తరువాత జరుగుతున్న ఈ కార్యక్రమానికి మోదీ హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ బ్రిక్స్‌ సమావేశంలో సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రకటన భారత్‌కు కీలకమైనదిగా అధికారులు భావిస్తున్నారు. బ్రిక్స్‌ సమావేశంలో వాణిజ్యం, ప్రత్యామ్నాయ కరెన్సీ వినియోగంపై జరిగే చర్చలపై కూడా అందరి దృష్టి ఉంది.  బ్రిక్స్‌ ‘డి-డాలరైజేషన్‌’ ప్రణాళికలకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
బ్రిక్స్‌ సమావేశం నోట్‌ ప్రకారం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌), ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటిఓ) వంటి సంస్థల్లో సంస్కరణలు, ‘నాయకత్వ స్థానాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచడం’, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్‌ సౌత్‌ సహకారం.. వంటి అంశాలపైనా ఈ శిఖరాగ్ర సమావేశం చర్చిస్తుంది. కెనడాలో జి-7 శిఖరాగ్ర సమావేశం జరిగిన రెండు వారాల తర్వాత అంటే జూలై 6, 7 తేదీల్లో బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది.
కెనడాలో కొత్తగా ఎన్నికైన ప్రధాన మంత్రి మైక్‌ కార్నీ జి-7 సమావేశానికి భారత ప్రధాని మోదీని ఇప్పటి వరకూ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానించలేదు. బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, మెక్సికో వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలను కూడా ఆహ్వానించారు. గత రెండు దశాబ్దాలలో భారతదేశం అనేక జి-7, జి-8 కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. 2019 నుండి ప్రతి జి-7 శిఖరాగ్ర సమావేశానికి మోదీ హాజరయ్యారు.
బ్రిక్స్‌ కూటమిలో బ్రెజిల్‌, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా సభ్య దేశాలు. ఈ కూటమిలోకి కొత్తగా సౌదీ అరేబియా, యుఎఇ, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, ఇండోనేషియా ప్రవేశించాయి. ఈ దేశాలు ప్రపంచ జనాభాలో సగం, ప్రపంచ జిడిపిలో 39 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.