సిందూరం మొక్కను నాటిన ప్రధాని మోదీ

సిందూరం మొక్కను నాటిన ప్రధాని మోదీ
‘ఆపరేషన్ సిందూర్’ను గుర్తు చేస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ సిందూరం మొక్కను నాటారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గురువారం తన అధికారిక నివాసానికి సమీపంలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో మొక్క నాటి ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు.  దేశంలోని ప్రతీ ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు పాటుపడి, పచ్చదనాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్య పేరు ‘ఆపరేషన్ సిందూర్’. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధాని మోదీ సిందూరం మొక్కను నాటడం అందరి దృష్టిని ఆకర్షించింది.  ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రత్యేకంగా హాజరయ్యారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా కూడా పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా 700 కి.మీ ఆరావళి పర్వత శ్రేణిలో అడవులకు తిరిగి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిందని మోదీ తెలిపారు.  ‘‘ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారం ద్వారా 700 కి.మీ మేర విస్తరించి ఉన్న ఆరావళి పర్వత శ్రేణులను హరిత భరితం చేయాలనేది మా లక్ష్యం. ప్రజలతో మొక్కలు నాటించి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును బలోపేతం చేయడమే మా సంకల్పం. ఆరావళి పర్వతశ్రేణులు ఈ భూమిపైనే అత్యంత ప్రాచీనమైనవి. ఇవి గుజరాత్, రాజస్థాన్, హరియాణా, ఢిల్లీలలో విస్తరించి ఉన్నాయి” అని ప్రధాని తెలిపారు. 

“గత కొన్నేళ్లుగా ఈ పర్వత శ్రేణులు సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. పర్యావరణపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆయా సవాళ్లను అధిగమించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఆరావళి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంచేందుకు మా ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై ఎక్కడికక్కడ స్థానిక అధికార యంత్రాంగాలతో కలిసి పనిచేయబోతున్నాం” అని వెల్లడించారు. 

“జల వ్యవస్థల నిర్వహణను మెరుగుపర్చడం, ఇసుక తుఫానులకు నిరోధించడం, థార్ ఎడారి తూర్పు వైపుగా విస్తరించకుండా నిలువరించడం వంటివన్నీ చేయబోతున్నాం’’ అని పేర్కొంటూ ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు.