రెజ్ల‌ర్ వినేశ్ పోగ‌ట్‌పై అనర్హత వేటు

రెజ్ల‌ర్ వినేశ్ పోగ‌ట్‌పై అనర్హత వేటు

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భార‌తీయ రెజ్లింగ్ స‌మాఖ్య షోకాజ్ నోటీసు జారీ చేసింది. క్ర‌మ‌శిక్ష‌ణార‌హిత్యానికి పాల్ప‌డింద‌ని, యాంటీ డోపింగ్ రూల్స్‌ను అతిక్ర‌మించిన‌ట్లు ఆమెపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది జూన్ వ‌ర‌కు వినేశ్ ఎటువంటి టోర్నీల్లో పాల్గొన‌డానికి అర్హురాలు కాద‌ని రెజ్లింగ్ స‌మాఖ్య పేర్కొన్న‌ది.  యాంటీ-డోపింగ్ నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణా రాహిత్యం కింద డబ్ల్యూఎఫ్‌ఐ ఆమెకు 15 పేజీల నోటీసును జారీ చేసింది.

వినేశ్ ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల దేశానికి చెడ్డ పేరు వ‌చ్చిన‌ట్లు ఆ నోటీసులో తెలిపారు. భార‌తీయ రెజ్లింగ్ వ్య‌వ‌స్థ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింద‌ని, డ‌బ్ల్యూఎఫ్ఐ నిబంధ‌న‌ల‌ను ఆమె ఉల్లంఘించిన‌ట్లు పేర్కొన్నారు.  దానితో పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి మ్యాట్‌పైకి అడుగుపెట్టాలనుకున్న ఆమె ఆశలకు బ్రేక్ వేసింది. మే 10 నుంచి 12 వరకు గోండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనకుండా ఆమెను నిషేధించింది.  

యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు) యాంటీ-డోపింగ్ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ తర్వాత మళ్లీ పోటీల్లోకి దిగాలంటే అథ్లెట్లు కనీసం ఆరు నెలల ముందుగా సమాచారం ఇవ్వాలి. వినేశ్ ఈ నిబంధనను పాటించలేదని డబ్ల్యూఎఫ్‌ఐ పేర్కొంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బరువు నిబంధనల కారణంగా అనర్హతకు గురై దేశ ప్రతిష్టను దెబ్బతీశారని నోటీసులో ఆరోపించింది. 

యాంటీ-డోపింగ్ టెస్ట్ నిబంధనల్లో భాగంగా తన ఆచూకీ తెలపడంలో విఫలమయ్యారని పేర్కొంది. మార్చి 2024లో అప్పటి ఐఓఏ తాత్కాలిక కమిటీ నిర్వహించిన ఎంపిక ట్రయల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా రెండు వేర్వేరు బరువు విభాగాల్లో పాల్గొనడాన్ని తప్పుబట్టింది. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు వినేష్ కు డబ్ల్యూఎఫ్‌ఐ 14 రోజుల గడువు ఇచ్చింది.

తన పునరాగమనాన్ని అడ్డుకునేందుకే డబ్ల్యూఎఫ్‌ఐ ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తోందని వినేష్ ఆరోపించగా, సమాఖ్య ఆ వాదనలను తీవ్రంగా తోసిపుచ్చింది. మరోవైపు, రాబోయే ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌కు సైతం ఆమె దూరమైంది. 2025, 2026లో పతకాలు సాధించిన వారే ట్రయల్స్‌కు అర్హులని డబ్ల్యూఎఫ్‌ఐ నిబంధనలు మార్చడంతో పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఎలాంటి పోటీల్లో పాల్గొనే అర్హతను వినేష్ కోల్పోయారు.