* బెంగళూరు పోలీస్ కమిషనర్ సస్పెన్షన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం ఆపై జరిగిన తొక్కిసలాటకు సంబంధించి టీం యాజమాన్యం విచారణ ఎదుర్కోబోతోంది. వీరితో పాటు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్ సీఎ) సీనియర్ సభ్యులను కూడా విచారించనున్నారు. ఆర్సీబీ క్రికెటర్లకు సత్కార వేడుకను ప్లాన్ చేయడంలో వీరి పాత్రను ఇప్పుడు బెంగళూరు పోలీసులు, ఇంకా మెజిస్టీరియల్ విచారణ ప్యానెల్ సమీక్షిస్తోంది. ముఖ్యంగా తొక్కిసలాటకు కొన్ని గంటల ముందు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌పై విచారణ జరగనుంది.
గురువారం బెంగళూరు పోలీసులు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఆర్సీబీ, డిఎన్ ఎ (ఈవెంట్ మేనేజర్), కేఎస్ సిఎ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ, ఇతరులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. తొక్కిసలాట సంఘటనలో నేరపూరిత నిర్లక్ష్యం ఉందని అందులో పేర్కొంది. మరోవంక, క్రికెట్ స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 33 మందికి పైగా గాయపడిన ఘటనపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన కోర్టు, జూన్ 10 నాటికి వివరణాత్మక స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ఆదేశించింది. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ వి. కామేశ్వర్ రావు, జస్టిస్ సీఎం జోషి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ విషయాన్ని సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటిషన్‌గా పరిగణించాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానందతో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.
హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్యతో సహా వివిధ అభియోగాల కింద వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొన్ని గంటల తర్వాత, ఆర్‌సిబి జట్టు ప్రతినిధులు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ డిఎన్‌ఎ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) ప్రతినిధులను అరెస్టు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ విషాద సంఘటనపై కర్ణాటక హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ డి’కున్హా నేతృత్వంలో ఏకసభ్య న్యాయ విచారణను ముఖ్యమంత్రి ప్రకటించారు.
కాగా, ఘటనకు కొన్ని గంటల ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఈవెంట్ కు సంబంధించి అధికారికంగా ఒక పోస్ట్ పెట్టింది. జూన్ 4వ తేదీ మధ్యాహ్నం గం. 3:14కు ఆర్సీబీ అఫీషియల్ ‘ఎక్స్’ హ్యాండిల్‌లో ఈ పోస్ట్ పెట్టింది. ‘విక్టరీ పరేడ్ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో వేడుకలు జరుగుతాయి. అందరూ రోడ్‌షోను శాంతియుతంగా ఆస్వాదించగలిగేలా పోలీసులు, ఇతర అధికారులు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని మేము అందరు అభిమానులను అభ్యర్థిస్తున్నాము. ఉచిత పాస్‌లు (పరిమిత ప్రవేశం)shop.royalchallengers. comలో అందుబాటులో ఉన్నాయి” అని సదరు పోస్ట్‌లో పేర్కొన్నారు.
ముఖ్యంగా దర్యాప్తు చేయనున్నారు. కాగా, మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్సీబీ నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు గురువారం ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారి సహాయార్థం ఆర్‌సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. “బెంగళూరులో జరిగిన దురదృష్టకర ఘటన ఆర్‌సీబీ కుటుంబానికి తీవ్ర బాధను కలిగించింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. అంతేకాదు, గాయపడిన అభిమానులను ఆదుకునేందుకు ఆర్‌సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తాం” అని ఆర్‌సీబీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవంక, ట్రోఫీ గెలిచిన ఒక రోజు తర్వాత విజయోత్సవ వేడుకలను కొనసాగించడంపై ఆర్‌సిబి విస్తృత విమర్శలు ఎదుర్కొంది. ఇంత పెద్ద ఈవెంట్‌కు అవసరమైన భద్రతను ఏర్పాటు చేయడానికి పరిపాలన, పోలీసు అధికారులకు తగినంత సమయం నిరాకరించింది. బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా బుధవారం ఏర్పాట్లలో లోపాలను ఇప్పటికే ప్రశ్నించారు.
అటువంటి కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి ఫ్రాంచైజ్, పోలీసులు, జిల్లా పరిపాలన మధ్య సరైన సమన్వయం అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు. గత సంవత్సరం భారతదేశం టి 20 ప్రపంచ కప్ విజయం తర్వాత లక్షలాది మందిని వీధుల్లోకి తీసుకువచ్చిన ముంబైలో జరిగిన సజావుగా విజయోత్సవ కవాతును ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.
ఐపీఎల్ విజయం సాధించిన మరుసటి రోజు బెంగళూరు పోలీసులు ఆర్‌సిబి సత్కార కార్యక్రమాన్ని నిర్వహించవద్దని సూచించారని, సమర్థవంతమైన జనసమూహ నిర్వహణకు సిద్ధం కావడానికి కనీసం మరో రెండు రోజుల సమయం కావాలని అభ్యర్థించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆర్‌సిబి యాజమాన్యం ఆ అభ్యర్థనకు అంగీకరించక పోవడంతో విషాదకరమైన తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు.

More Stories
తెలంగాణలో బీజేపీకి అద్భుత ఆదరణ
అమెరికాకు దడపుట్టిస్తున్న ఇరాన్ ‘దోమల దండు’ వ్యూహం
రెజ్లర్ వినేశ్ పోగట్‌పై అనర్హత వేటు