
భారతదేశం, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు మరోసారి ఉద్రిక్త పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయానికి చెందిన మరో అధికారి తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను దేశం నుంచి బహిష్కరించింది. 24 గంటల్లోగా భారత్‌ను విడిచి వెళ్లాలని డెడ్‌లైన్ విధించింది. తన హోదాకు తగ్గట్లు నడుచుకోకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది.
ఇటీవల మే 13న గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగంపై ఓ పాక్ అధికారిని కేంద్ర బహష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారం వ్యవధిలో మరో అధికారి బహిష్కరణకు గురికావడం గమనార్హం. ఇప్పుడు సదరు అధికారిపై ఎలాంటి అభియోగాలు తీసుకున్నారనేది మాత్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించలేదు. ఎనిమిది రోజుల వ్యవధిలో వ్యవధిలో రెండోసారి వారంలోపు మరో అధికారిని బహిష్కరిస్తూ భారత్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ అధికారి “పర్సొనా నాన్ గ్రాటా”గా (అవాంఛిత వ్యక్తిగా) ప్రకటించబడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే, ఆయన ఇకపై భారత్‌లో ఉండేందుకు అనుమతి లేదు. జమ్ముకశ్మీర్ పహల్గాంలో ఉన్న బైసనర్ లోయలో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపింది. వైమానిక స్థావరాలను మట్టుబెట్టింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సైనికపరమైన ఉద్రిక్తతలు తలెత్తి, సద్దుమణిగిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మరోవైపు, పహల్గాం ఉగ్రదాడితో వణికిపోయిన జమ్మూకశ్మీర్ ప్రజలను ఇప్పుడు మరో సమస్య వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి సంచరిస్తుండటంతో స్థానికులకు కొత్త సమస్య ఎదురవుతోంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక అయోమయానికి గురవుతున్నారు. అటు భద్రతా సిబ్బందికి ఉన్న ముప్పును పసిగట్టడంలో కూడా ఇబ్బంది ఎదురవుతుంది. పహల్గాం దాడి నాటి నుంచి ఈ తరహా ఘటనలు పెరగడం ఆందోళనకరంగా మారింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్