భారత్ ను ప్రభావించం చేసేందుకు ఐరోపా దేశాల యత్నం

భారత్ ను ప్రభావించం చేసేందుకు ఐరోపా దేశాల యత్నం

భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ఐరోపా దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ ఐరోపా దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై విదేశాంగ మంత్రి డా. ఎస్ జైశంకర్ విమర్శలు చేశారు. భారత్‌తో బలమైన సంబంధాల కోసం ఐరోపాలోని దేశాలు ఆసక్తితో పాటు సున్నితత్వాన్ని ప్రదర్శించాలని ఆయన సూచించారు.  భారత్‌ భాగస్వామ్యాల కోసం ఎదురుచూస్తోందని బోధకుల కోసం కాదని అంటూ చురకలంటించారు.

ఢిల్లీలో జరిగిన ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ ఐస్లాండ్ మాజీ అధ్యక్షుడు గ్రిమ్సన్  తదితరులతో జరిగిన చర్చావేదికలో యూరప్ తీరును జైశంకర్ ఎండగట్టారు. ఐరోపా దేశాల నుంచి భారత్ ఏం కోరుకుంటుదని అడిగిన ప్రశ్నకు జై శంకర్ తనదైన రీతిలో స్పందించారు. “ప్రపంచ దేశాలతో మేము భాగస్వామ్యాన్ని కోరుకుంటాం. బోధనలను కాదు. ఎవరైతే బోధిస్తుంటారో వారు వాటిని పాటించరు. మిగతా వారిని అనుసరించమని చెబుతారు. ఐరోపాలోని కొన్ని దేశాలు ఈ సమస్యతో ఇంకా ఇబ్బందిపడుతున్నాయి. మరికొన్ని మారుతున్నాయి” అంటూ ధ్వజమెత్తారు. 

“ఐరోపా ప్రస్తుతం వాస్తవాలను అర్థం చేసుకుంటోంది. వాటి ఆధారంగా వారు మారుతారో, లేదో చూడాల్సి ఉంది. మేము(భారత్‌) ఇతరులతో సంబంధాలను ఏర్పర్చుకోవాలంటే అవగాహన, పరస్పరం ప్రయోజనాలతో పాటు ప్రపంచం ఎలా పని చేస్తుందనే వాస్తవాన్ని కూడా తెలిసి ఉండాలి” అని హితవు చెప్పారు.  భారత్‌- రష్యా మధ్య వర్తక, వినియోగదారు లాంటి బంధమే ఉందని జైశంకర్ స్పష్టం చేశారు. 

భారత్‌కు యూరప్‌తో దాదాపు 40 ఏళ్ల స్నేహబంధం ఉందని, కొన్నేళ్ల క్రితం దానితో పలు ఒప్పందాలు చేసుకున్నామని జైశంకర్‌ గుర్తు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నివారణకు మాస్కో ప్రమేయం లేకుండా పశ్చిమ దేశాలు చేసిన పలు ప్రయత్నాలను విదేశాంగ మంత్రి విమర్శించారు. అమెరికాతో పరస్పర ప్రయోజనాల ఆధారంగా సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. 

భారత్‌ ఎల్లప్పుడూ వాస్తవికతను సమర్థిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ యూరోపియన్ దేశాల తీరుపై జైశంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యూరప్ సమస్యల్ని ప్రపంచ సమస్యలుగా చూపిస్తారని, ప్రపంచ సమస్యల్ని మాత్రం వారు ఏమాత్రం పట్టించుకోరంటూ చరకలు అంటించారు.