నీట్‌ నుంచి తమిళనాడు మినహాయింపుకు రాష్ట్రపతి తిరస్కృతి

నీట్‌ నుంచి  తమిళనాడు మినహాయింపుకు రాష్ట్రపతి తిరస్కృతి
వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్ష విషయంలో డిఎంకె ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. నీట్‌ పరీక్ష నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ శుక్రవారం జరిగిన అసెంబ్లీలో ప్రకటించారు. 
 
నీట్‌ నగర విద్యార్థులకు, ధనవంతులకు మాత్రమేనని, పేద విద్యార్థుల కలలకు దూరమని, సామాజిక న్యాయానికి విరుద్ధమని స్టాలిన్‌ ఈ సందర్భంగా విమర్శించారు. ఈ విషయంపై కేంద్రం తమ అభ్యర్థనను తిరస్కరించినా తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
 
నీట్‌ పరీక్ష అమల్లోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు వైద్య విద్యనభ్యసించాలనే కలలు నెరవేరవు. వారు కోచింగ్‌కి వెళ్లలేరు. ఈ నీట్‌ పరీక్ష గ్రామాల్లోని వైద్య సేవను ప్రభావితం చేస్తుంది. ఈ నీట్‌ పరీక్ష కేవలం నగర విద్యార్థులకు, ధనవంతులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. 
 
ఈ పరీక్షపై తమిళనాడు ప్రజలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఈ పరీక్షకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపితే అన్ని అభ్యర్థనలను కేంద్రం రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
 
నీట్‌ పరీక్ష వల్ల వైద్యవిద్యను చదవలేక చాలా మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు అసెంబ్లీ నీట్‌ను రద్దు చేసి ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల ఆధారంగా విద్యార్థులను వైద్యవైద్యకు అనుమతించాలని తీర్మానించింది. ఈ సమస్యపై సమీక్షించడానికి ప్రభుత్వం ఎ.కె రాజన్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 
 
ఈ కమిటీ సిఫార్సుల మేరకు అసెంబ్లీ నీట్‌కు వ్యతిరేకంగా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత ఈ అభ్యర్థనను కేంద్రానికి పంపింది. అయితే 2022 ఫిబ్రవరి 5న కేంద్రం ఈ అభ్యర్థనను తిరస్కరించింది. మరోసారి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, నీట్‌కి వ్యతిరేకంగా ఫిబ్రవరి 8 20022న అసెంబ్లీలోని బిల్లును ఆమోదించింది. 
 
2002 నుంచి కేంద్రం అమలు చేస్తున్న ఈ పరీక్షా విధానంపై తమిళనాడు వ్యతిరేకిస్తూనే వస్తుంది. తమిళనాడు అభ్యర్థనను రాష్ట్రపతి ఆమోదించకపోవడం ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థలో నల్లని పేజీగా స్టాలిన్ అభివర్ణించారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రజల్ని అగౌరవపరిచిందని ఆయన ఆరోపించారు. 
 
అసెంబ్లీ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదని పేర్కొంటూ ఈ చర్యలను ప్రజలను గమనిస్తున్నారని హెచ్చరించారు.  నీట్‌పై న్యాయ నిపుణులను సంప్రదించి కోర్టులో దీనిపై సవాల్‌ చేస్తామని ఆయన ప్రకటించారు. దీనిపై ఏప్రిల్‌ 9న సచివాలయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.