పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతో జనవరి 31న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోనియా చేసిన వ్యాఖ్యలపై దుమారం తర్వాత వాయిదాపడిన లోక్‌సభ, తిరిగి 12గంటలకు సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు.
ఈ సమావేశాల్లో 16 బిల్లులు ఆమోదం పొందటంతోపాటు సభ 118 శాతం పనిచేసినట్లు తెలిపారు. ఆర్థిక బిల్లు సహా వివిధ మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లకు లోక్‌సభ ఆమోదంతో బడ్జెట్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్ బడ్జెట్‌కు కూడా లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.
అధికార ప్రతిపక్షాల బలప్రదర్శనకు కారణమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుదీర్ఘ చర్చ తర్వాత లోక్‌సభ ఆమోదం తెలిపింది. లోక్‌సభ వాయిదా పడిన కొద్దిసేపటికే రాజ్యసభను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. వక్ఫ్ (సవరణ) బిల్లుతోపాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
సభ ఉత్పాదకత 119 శాతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 3న (గురువారం) ఉదయం 11 గంటల నుంచి వేకువజామున 4.02 వరకు సభను నిర్వహించామని, రాజ్యసభ చరిత్రలోనే ఇంత సుదీర్ఘ సమయం సభ నడవడం ఇదే తొలిసారి అని ఆయన వివరించారు. ఇది దేశ ప్రజలకు గొప్ప సందేశాన్ని పంచుతుందన్న ఆయన, పార్లమెంట్‌పై ప్రజలకు నమ్మకాన్ని పెంచుతుందని చెప్పారు.
అంతకుముందు అమెరికా ప్రతీకార సుంకాలు, సోనియా వ్యాఖ్యల అంశాలపై పార్లమెంటు దద్దరిల్లింది. లోక్‌సభలో అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నాయి. ఈ ఉదయం 11గంటలకు సభ ప్రారంభం కాగానే సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రసంగించిన సోనియా, వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడిగా పేర్కొన్నారు.

More Stories
సృష్టి ఆరంభం నుంచి మాతృత్వం అనే పునాదిపైనే ప్రపంచం
పేపర్ లీక్‌పై 303 మిలియన్ల వ్యూస్ ప్రధాని మోదీ ఇన్‌స్టా రీల్ రికార్డు
విద్యార్థుల మనోభావాలను రాజకీయంగా `హైజాక్’ చేస్తున్న ప్రతిపక్షాలు