బట్టబయలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం

బట్టబయలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ బిజెపి చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయిందని, ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం కొనసాగుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. డీలిమిటేషన్ పేరుతో మొన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటికాగా,త్వరలో తెలంగాణలో కలిసే బహిరంగ సభను నిర్వహించబోతున్నారని వెల్లడించారు. 

ఈ బహిరంగ సభ ఏర్పాట్లు రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, ఎవరిని పిలవాలో కలిసే నిర్ణయిస్తామని చెప్పారు. అట్లాగే నిన్న పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్ సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశాయని గుర్తుచేశారు.

ఈరోజు జీహెచ్ ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కు చివరి రోజు అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టకుండా మజ్లిస్ అభ్యర్ధికి మద్దతుగా నిలిచాయని తెలిపారు. ఇక ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నాయకులంతా కోడైకూశారని గుర్తు చేశారు.

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, ధరణి పోర్టల్ లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారని, ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ అవినీతి చేశారని పదేపదే ప్రచారం చేశారని చెప్పారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని కాంగ్రెస్ నేతలు తీరా గెలిచాక డబ్బు సంచులకు అమ్ముడుపోయి బీఆర్ఎస్ తో కుమ్కకై అవినీతి కేసులన్నీ నీరుగారుస్తున్నారని సంజయ్ ఆరోపించారు. 
 
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని ప్రశ్నించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంవల్ల గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలు పోటీ చేయాల్సిన 30 చోట్ల మజ్లిస్ పోటీ చేసి గెలిచిందని గుర్తు చేశారు. ఇప్పుడు బీసీ జాబితా ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంవల్ల విద్య, ఉద్యోగాల్లో బీసీలకు తీరని అన్యాయం జరగబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్ ను మజ్లిస్ పార్టీ చేతుల్లో పెట్టడానికి సిద్దమయ్యాయని చెబుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కుమ్కక్కు రాజకీయాలపై తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు.