త్వరలో భారత పర్యటనకు పుతిన్‌

త్వరలో భారత పర్యటనకు పుతిన్‌
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. గతేడాది మాస్కో పర్యటన సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్‌ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించింది.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్‌ గురువారం టెలివిజన్‌ ప్రసంగంలో ఈ పర్యటన గురించి వెల్లడించారు. రష్యా, భారత్‌లు తమ ద్వైపాక్షిక సంబంధాలను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని, ఈ పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు  `రష్యా, భారతదేశం : కొత్త ద్వైపాక్షిక అజెండా వైపు’ అనే సమావేశంలో లావ్రోస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

“పుతిన్‌ భారత పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయి. మోదీ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు. గతేడాది మోదీ మాస్కోలో పర్యటించారు. ఇప్పుడు మా వంతు” అని  సెర్గీ లావ్‌రోవ్‌ వెల్లడించారు. అయితే, పుతిన్‌ పర్యటనకు సంబంధించి కచ్చితమైన తేదీలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మొదలయ్యాక పుతిన్‌ భారత్‌లో పర్యటించనుండడం ఇదే తొలిసారి కానున్నది. ఈ పర్యటన పుతిన్‌కు ఎంతో కీలకం కానున్నది. వాస్తవానికి రష్యా, భారత్‌ మధ్య ఓ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం అగ్రనేతలు సంవత్సరంలో ఒకసారి ఒకరి దేశంలో మరొకరు సంప్రదించాల్సి ఉంది.