అమెరికా ఆటో టారిఫ్‌లు కెనడాపై ప్రత్యక్ష దాడి

అమెరికా ఆటో టారిఫ్‌లు కెనడాపై ప్రత్యక్ష దాడి

అమెరికా ఆటోలపై విధించిన టారిఫ్‌లపై కెనడా ధ్వజమెత్తింది. ఈ టారిఫ్‌లు తమ దేశంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. ”అమెరికా టారిఫ్‌లు మా దేశంపై ప్రత్యక్ష దాడి, మా కార్మికులను రక్షించుకుంటాం, మా కంపెనీలను రక్షించుకుంటాం, మా దేశాన్ని రక్షించుకుంటాం” అని ప్రధాని మార్క్‌ కార్నీ పేర్కొన్నారు. 

అయితే ప్రతీకార చర్యలకు ముందు ట్రంప్‌ ఉత్తర్వులను పరిశీలించాల్సివుందని పేర్కొన్నారు. ఇది అన్యాయమని దుయ్యబట్టారు. మందస్తుగా 1.4 బిలియన్‌ డాలర్ల ‘వ్యూహాత్మక ప్రతిస్పందన నిధి’ని ప్రకటించారు. ఈ నిధి ట్రంప్‌ విధించే సుంకాల వలన ప్రభావితమైన కెనడా ఆటో ఉద్యోగాలను కాపాడుతుందని తెలిపారు.

ఆటోలు కెనడా రెండవ అతిపెద్ద ఎగుమతిగా ఉన్నాయని, ఈ పరిశ్రమలతో 1,25,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుండగా, సుమారు 5,00,000 మందికి సంబంధిత పరిశ్రమలలో పరోక్షంగా ఉపాధి కలుగుతోందని తెలిపారు. కెనడా ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు.

విదేశాల్లో తయారై అమెరికాకు దిగుమతయ్యే కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. కానీ, అమెరికాలో తయారైన కార్లపై ఎలాంటి సుంకం ఉండదని స్పష్టంచేయడం విశేషం. ఈ సుంకం పెంపు వచ్చే వారం నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించారు.ఇది శాశ్వతమైన చర్యగా పేర్కొన్న ఆయన దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రతియేటా 100 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరనున్నదని పేర్కొన్నారు.

దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ట్రంప్‌ సుంకాల పెంపును తెరపైకి తీసుకొస్తున్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే ఏ వస్తువుపైన 25 శాతం సుంకం విధించనున్నట్లు గతంలోనే పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో సరాసరి కారు ధర 49 వేల డాలర్లు ఉండగా, త్వరలో భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే కారుపై విధిస్తున్న సుంకం 12,500 డాలర్లకు ఎగబాకనున్నది. ట్రంప్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో దేశీయ ఎగుమతులపై నీలినీడలు కమ్ముకోనున్నది. ప్రతియేటా భారత్‌ నుంచి 7 బిలియన్‌ డాలర్ల విలువైన కార్లు అమెరికాకు ఎగుమతి అవుతుండగా..తాజా నిర్ణయంతో ఆయా సంస్థలు వెనక్కితగ్గే అవకాశాలున్నాయి.
ప్రధానంగా యూఎస్‌ మార్కెట్లో పాగావేసిన టాటా మోటర్స్‌ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌పై ఈ ప్రభావం అధికంగా పడనున్నది. 2024లో భారత్‌ నుంచి 2.2 బిలియన్‌ డాలర్ల విడిభాగాలు అమెరికాకు ఎగుమతి అయ్యాయి.  ట్రంప్‌ గతంలోనూ మెక్సికో , కెనడాల నుండి దిగుమతులపై అమెరికా వాహన తయారీదారులకు కొత్త సుంకాలపై ఒక నెల మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.