
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా, దాదాపు 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కన్పిస్తుండగా, మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో కమలదళం ఆధిక్యంలో కొనసాగుతోంది.
డిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటేసి అత్యధిక మెజార్టీలో కనబరుస్తోంది. ఉదయం 10.30 గంటల వరకు వెలువడిన ఫలితాలను చూస్తుంటే, ప్రస్తుతం బిజెపి 41 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. నాలుగోసారి అధికారం చేపట్టాలనుకున్న ఆప్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.
కాంగ్రెస్ తొలుత ఒక చోట ముందంజలో ఉన్నట్లే కన్పించినా ఆ తర్వాత వెనుకంజలోకి పడిపోయింది. ఏ స్థానంలోనూ హస్తం పార్టీ ప్రభావం చూపలేకపోయింది. బిజెపి దూకుడు ఆఖరి వరకు కొనసాగితే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకోవడం ఖాయమనే చెప్పాలి. ఆప్ గట్టి పోటీ ఇస్తున్నా.. బీజేపీ మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరుత్సాహపర్చింది. హస్తినలో మరోమారు చేతులెత్తేసింది హస్తం పార్టీ.
1998 నుండి ఢిల్లీలో అధికారంలో లేని బిజెపి, 2013 నుండి ఆధిపత్యం చెలాయించిన ఆప్‌ను ఓడించడానికి అహర్నిశలు పోరాడింది. 2015 ,2020లో జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో, ఆప్ బిజెపిని వరుసగా మూడు, ఎనిమిది స్థానాలకు పరిమితం చేసి ఓడించింది. ఢిల్లీలో ఒకప్పుడు అజేయంగా భావించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ – దేశ రాజధానిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన తొలి ఓటమిని చవిచూడబోతోంది.
More Stories
అన్ని మతాలను గౌరవిస్తాను
నేపాల్ ప్రధాని సుశీలా కర్కికి మద్దతు తెలిపిన మోదీ
ఆస్ట్రేలియాపై భారత మహిళల విజయం.. మంధాన సెంచరీ