బీజేపీకి జై కొట్టిన ఢిల్లీ ఓటర్లు

బీజేపీకి జై కొట్టిన ఢిల్లీ ఓటర్లు

* బిజెపికి 60  వరకు సీట్లు అంటున్న `పీపుల్స్ పల్స్’  ఎగ్జిట్ పోల్స్ 

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. దేశంలో బీజేపీ ఆధిపత్యానికి కట్టడి వేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి భవిష్యత్తుపై కూడా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండనుంది. 
 
హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి. ఢిల్లీ  అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య త్రిముఖ పోటీ జరిగినా ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యనే ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్ద కాలంపైగా  అధికారంలో ఉన్న ఆప్కు ఈ సారి భంగపాటు కలిగి, అధికారానికి 27 ఏళ్లు దూరంగా ఉన్న బీజేపీకి గెలిచే అవకాశాలున్నట్టు ఎగ్టిట్ పోల్లో వెల్లడైందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సీనియర్ రీసెర్చర్ జి. మురళీకృష్ణ తెలిపారు.

జాతీయ రాజకీయాలకు గుండెకాయ లాంటి ఢిల్లీ  ఎన్నికలను అంచనా వేయడానికి గత నెల రోజులుగా ట్రాకర్ పోల్స్ నిర్వహిస్తున్న పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు ఎన్నికలు జరిగిన ఫిబ్రవరి 5వ తేదీన ఎగ్జిట్ పోల్ చేపట్టింది. బీజేపీ  51  -60 స్థానాలు, ఆప్ 10  -19 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్టు ఎగ్జిట్ పోల్లో తేలింది.  ఢిల్లీలో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని వెల్లడయ్యింది.

 
 బీజేపీకి 48.5 నుండి 52.5 శాతం ఓట్లు, ఆప్ కు 36.5 నుండి 40.5 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 6.5 నుండి 8.5 శాతం ఓట్లు, ఇతరులకు 3.1 నుండి 5.1 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. సీట్లు, ఓట్లలో ఆప్ వెనుకబడినా ఢిల్లీలో ఇప్పటికీ ఆప్ అధినేత కేజ్రీవాల్ కే ప్రజాదరణ కనిపిస్తుంది. ఆప్ ప్రకటించిన పలు పథకాలు, వరాలతో మహిళా ఓటర్లు ఆప్ వైపు మొగ్గు చూపుతున్నారు. 
 
మహిళా ఓటర్లలో ఆప్ కు 50.20 శాతం, బీజేపీకి 41.90, కాంగ్రెస్ కు 6.10, ఇతరులకు 1.90 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉండడంతో మహిళా ఓటర్లలో ఆప్ బీజేపీపై 8.3. శాతం ఓట్ల ఆధిక్యతను కనబరుస్తోంది. పురుష ఓటర్ల నాడిని అంచనా వేస్తే బీజేపికి 53 శాతం, ఆప్ కు 35 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. అగ్రవర్ణాల వారు, ఓబీసీలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 
 
దళితులు, ముస్లింలు, సిక్కులు, జాతవ్, చమార్, వాల్మీకి సామాజిక వర్గాల ఓటర్లు ఆప్ వైపు మొగ్గు చూపుతున్నారు. సామాజిక వర్గాలను పరిశీలిస్తే బ్రాహ్మణులు, రాజ్ ఫుట్ లు, జాట్లు, బనియాలు, అగర్వాల్, కశ్మీర్ పండిట్లు, గుప్త సామాజిక ఓటర్లు బీజేపీ వైపు ఉన్నారు. ఆప్ కు 70.5 శాతం ముస్లింల, 54.2 శాతం సిక్కుల మద్దతు కనిపిస్తుంది. 
 
దేశ రాజధాని ఢిల్లీ లో అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్రజలు నివసిస్తుండడంతో మినీ ఇండియాగా పిలుస్తారు. అందుకే జాతీయ రాజకీయాలకు, ఢిల్లీ రాజకీయాల మధ్య కొంత సారుప్యత కనిపిస్తుంది. బీజేపీకి పూర్వాంచల్, ఢిల్లీ స్థానికులు, ఉత్తరాదికి చెందిన ప్రజలు ప్రధానంగా యూపీ, బీహారీలు, హర్యానాకు చెందిన వారు , పాహడి, ఈశాన్య  ప్రాంతాల ప్రజలు మద్దతిస్తుండగా, పంజాబీలతో పాటు దక్షిణాది ప్రజలు ఆప్ వైపు ఉన్నారు. మధ్య తరగతి, ధనవంతులు బీజేపీకి, పేద ప్రజలు ఆప్కి మద్దతుగా ఉన్నట్టు ఎగ్జిట్ పోల్లో తేలింది. 
 
ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు విలక్షణమైన తీర్పు ఇస్తుండడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా బీజేపీ వదులుకోలేదు. 2014, 2019, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ లోని మొత్తం 7 ఎంపీ సీట్లను గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి అధికారానికి దూరమవుతోంది. పాతికేళ్లకు పైగా ఢిల్లీ గద్దెకు దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా నిర్వహించింది.
 
మైక్రో లెవల్లో ఇంటింటికీ పార్టీ కార్యకర్తలు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించి ప్రచారం చేయడంతో ఆ పార్టీకి కలిసి వచ్చింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆర్ఎస్ఎస్ తో పాటు ఢిల్లీ పరివార్ అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఢిల్లీ లోని పలు కాలనీల్లో, మురికివాడ ప్రాంతాల్లో పర్యటిస్తూ వేలాదిగా చిన్న చిన్న సమావేశాలను నిర్వహించి ప్రజలకు చేరువవడం బీజేపీకి లాభించింది. 
 
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ లో పెద్ద ఎత్తున ‘పరివర్తన్ ర్యాలీ’లు చేపట్టి ‘ఆప్దా నహీ సహేంగే, బదల్ కర్ రహేంగే’ (విఫలమైన ఆప్ ను ఇక సహించేది లేదు, మార్పు తీసుకొద్దాం) అని ఇచ్చిన పిలుపు ఓటర్లపై ప్రభావం చూపింది.  ఆప్ ప్రభుత్వంపై వచ్చిన లిక్కర్ స్కాం, ఈ కేసులో ఆప్ ఛీప్ కేజ్రీవాల్ జైలుకెళ్లడంతో పాటు శేష్ మాల్ అవినీతి అంశాన్ని కూడా బీజేపీ అస్త్రాలుగా చేసుకోవడంతో బీజేపీకి లాభించింది. 
 
ప్రజాకర్షణ పథకాలతో ఆప్ కు పేద మధ్య తరగతి వర్గాల్లో ప్రజాదరణ ఉన్నా స్థానిక సమస్యలు ఆ పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి. తాగు నీటి కొరత, పాడైన రహదారులు, ప్రజా రవాణాలో పలు సమస్యలతో పాటు ఆప్  సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి ప్లస్ పాయింట్లయ్యాయి. నియోజకవర్గాల వారిగా విఫలమైన ఆప్ ఎమ్మెల్యేలపై ‘చార్జీ షీట్లు’ విడుదల చేస్తూ బీజేపీ ప్రచారం చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రెట్టింపయింది. 
 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ ఒత్తిడితో కేసులు బనాయించి ఆప్ నేతలను వేధిస్తుందని ఆప్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి సానుభూతి పొందేందుకు ప్రయత్నించినా, అది  ఆశించిన మేరకు నెరవేరినట్లు కనిపించలేదు.  మూడు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కేజ్రీవాల్ కు ప్రజాదరణ ఉన్నా  పార్టీలో ఇతర నేతలు ఆ స్థాయిలో లేకపోవడం కూడా ఆప్ కు నష్టం చేకూర్చింది. 
 
‘ఇండియా’ గ్రూపులో ఆప్, కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములైన అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తుండడంతో ఆప్ కు నష్టం కలుగుతోంది. ఆప్ కు వెనుదన్నుగా నిలుస్తున్న ముస్లిం, దళిత ఓట్లను కాంగ్రెస్ చీలుస్తుండడంతో ఆప్కు నష్టం జరుగుతుంది.  
 
కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ లో గతంలో ఘనమైన చరిత్ర ఉన్నా, 2013లో ఆప్ రాజకీయ ప్రవేశంతో పార్టీ మూలాలకే  ప్రమాదం ఏర్పడింది. 1998 నుండి 2013 వరకు 15 ఏళ్లకు పైగా నిరాటంకంగా షీలా దీక్షిత్ నేతృత్వంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రస్తుతం ఉనికి కోసం పోరుడుతోంది. 2013 ఆప్ రాజకీయ అరంగేట్రంతో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమై ఆప్, బీజేపీ ప్రధాన ప్రత్యర్థులుగా మారాయి. 
 
ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పొత్తు లేకుండా బరిలోకి దిగుతుండడంతో రెండు పార్టీలు నష్టపోతున్నాయి. ఈ పార్టీల మధ్య బీజేపీ వ్యతిరేక ఓట్లయిన ముస్లిం, దళిత ఓట్ల చీలిక వచ్చి బీజేపీకి లాభం కలిగిస్తున్నాయి. 
 
కేంద్రంలో వరుసగా బీజేపీకి అధికారంలోకి రావడం, అదే సమయంలో రాష్ట్రంలో వరుసగా ఆప్ అధికారంలోకి వస్తుండడంతో రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయ పోరుతో ఢిల్లీ లో అభివృద్ధి కుంటు పడుతుందనే అభిప్రాయం కూడా ఓటర్లలో కనిపించింది. ఢిల్లీ దేశ రాజధాని కావడంతో రాష్ట్రంలో పరిపాలన అంశాలు ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉండడంతో ఈ రెండు ప్రభుత్వాలు రాజకీయ కోణంతో నిత్యం ఘర్షణే జరుగుతుంది. 
 
రాజకీయ దృక్పథంతో రాష్ట్ర గవర్నర్ కు, ముఖ్య మంత్రికి పొసగక పోవడంతో ఢిల్లీ నష్ట పోతుందనే భావనతో రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధి పురోగతిలో ఉంటుందనే అభిప్రాయంతో ఉన్న ఢిల్లీ ప్రజలు బీజేపీ నినాదనమైన డబుల్ ఇంజిన్ సర్కార్ కు అనుకూలంగా ఉన్నారు.
 
చలి కాలంలోనూ ఢిల్లీ లో అసెంబ్లీ ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి. 1998లో అధికారం కోల్పోయి  27 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ, వరుసగా 2015, 2020లో గెలిచి ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ గెలుపు బాట పట్టాలని ఆప్ వ్యూహాలతో అసెంబ్లీ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు మారాయి. కేజ్రీవాల్ పై ఆరోపణలు రావడం, కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపుతో వేధిస్తుందని ఆప్ విమర్శించడం, రాష్ట్రంలో పరివర్తన్ వచ్చి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రావాలని బీజేపీ పిలుపుపై దేశ రాజధాని ప్రజల స్పందన ఫిబ్రవరి 8వ తేదీన వెలువడే ఫలితాల్లో తేలనుంది.