జయలలిత ఆస్తులన్నీ తమిళనాడు సర్కారుకే

జయలలిత ఆస్తులన్నీ తమిళనాడు సర్కారుకే
మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత ఆస్తికి సంబంధించిన వివాదం చాలాకాలంగా కొనసాగుతూనే వచ్చింది. తాజాగా బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దీనిపై కీలక తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో జయలలిత ఆస్తులన్నీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలంటూ  బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి హెచ్‌.ఎ.మోహన్‌ అధికారులను ఆదేశించారు.
 
ఆరు ట్రంకు పెట్టెలు తీసుకువచ్చి దివంగత ముఖ్యమంత్రి జయలలిత వజ్రాభరణాలు తీసుకెళ్లాలని బెంగళూరు సిటీ సెషన్స్ కోర్టు​ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలతో పాటు దానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిందిగా సూచించింది.
ఈ విషయంపై పిటిషన్​ దాఖలు చేసిన ఆర్​టీఐ కార్యకర్త టీ నరసింహ మూర్తి అదే తేదీల్లో కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది.  అలాగే కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వస్తువులను ఆర్​బీఐ, ఎస్​బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని గతేడాది ఫిబ్రవరిలో నిర్ణయించింది.
 
జయలలితకు చెందిన ఆస్తులను తమిళనాడు ప్రభుత్వం పదేళ్ల క్రితమే స్వాధీనం చేసుకుంది. అయితే అప్పుడు ఆ ఆస్తుల విలువ రూ.913 కోట్లుగా ఉంది. ప్రస్తుతం వాటి మార్కెట్‌ విలువ రూ. 4,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. అయితే ఆ ఆస్తులు మొత్తం తమకే చెందుతాయంటూ జయలలిత వారసులుగా చెబుతున్న జె.దీపక్‌, జె.దీపలు అనేక ప్రయత్నాలు చేశారు. 
 
ఇటీవల వాటిని తమకే అప్పగించాలంటూ కర్నాటక హైకోర్టును కూడా ఆశ్రయించగా విచారణ చేపట్టిన న్యాయస్థానం వారు వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. తాజాగా బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పునిస్తూ  జయలలిత ఆస్తులన్ని తమిళనాడు ప్రభుత్వానికే చెందుతాయని ప్రకటించింది. జయలలితకు చెందిన 1,562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, పది వేలకు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులను కర్నాటక ప్రభుత్వం అప్పగించనుంది.